CM Chandrababu Naidu: వాళ్లది రక్తపాతం..మాది జలపాతం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:37 AM
సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గుజరాత్‌లో ఒకే పార్టీ ప్రభుత్వం 25 ఏళ్లుగా అధికారంలో ఉంది.
సుపరిపాలనకు సహకరించండి
ఐదేళ్ల విధ్వంసకర పాలనను గాడిలో పెడుతున్నాం
దేన్నైనా వాయిదావేస్తా.. పింఛన్లను మాత్రం ఆపను
వైసీపీ ఫేక్ పార్టీ.. తప్పుచేసినోళ్లు తప్పించుకోలేరు
టెక్నాలజీ సాయంతో తుఫాన్‌ను ఎదుర్కొన్నాం
నాడు టెలికాం విప్లవం తెచ్చా.. నేడు నాది ఏఐ బాట
ఇప్పటికే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు
రాయలసీమకు రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు
సత్యసాయి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తాం
సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో సీఎం
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ల పంపిణీ
అనంతపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ‘‘గుజరాత్‌లో ఒకే పార్టీ ప్రభుత్వం 25 ఏళ్లుగా అధికారంలో ఉంది. అందుకే అక్కడ అభివృద్ధి సజావుగా సాగుతోంది. మన రాష్ట్రంలో నేను సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఐదేళ్లపాటు ధ్వంసమైన వ్యవస్థలను మేమిప్పుడు గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం’ అని వివరించారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజావేదికకు చంద్రబాబు హాజరయ్యారు. ముందుగా మేడా రెడ్డెమ్మ ఇంటికి వెళ్లి, ఆమెకు వితంతు పింఛన్‌ను ఆయన పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛన్ అందించారు. వారి కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
పేదల పెన్నిధి.. పీ-4
‘‘నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తానుగానీ, ఒకటో తేదీన పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రం ఆపబోను. ఏడాదికి పింఛన్ల కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పింఛన్ల కోసమే రూ.50,764 కోట్లు వెచ్చించాం. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇందులో 59 శాతం మంది మహిళలు ఉండగా, వారికి రూ.29,951 కోట్ల విలువైన పింఛన్లు అందించాం. రాష్ట్ర జనాభా 4.93 కోట్లలో 13 శాతం మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని చెప్పేందుకు ఇదే నిదర్శనం. పీ-4 ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం..’’
ముందు కంటే మెరుగ్గా సేవలు..
‘‘రాష్ర్టాన్ని పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. నిద్ర లేచినప్పటినుంచీ నేను ప్రజలగురించే ఆలోచిస్తా. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాల అమలుకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అప్పుడే సంక్షేమ పథకాలను సజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ‘ముందు కంటే ఇప్పుడు మెరు గ్గా పింఛన్లు వస్తున్నాయా..? లేదా..?’ (ఈ ప్రశ్న సీఎం వేసినప్పుడు..వస్తున్నాయని ప్రజలు బదులిచ్చారు) ఎక్కడ పింఛన్ ఇచ్చారు...ఏ టైమ్‌లో ఇచ్చారనేది నేరుగా కంప్యూటర్‌లో వస్తుంది. అదేరోజు సాయం త్రం ఐవీఆర్ మెసేజ్ కూడా పంపిస్తున్నాం.’’
ఒక్క చెరువూ తెగలేదు..
‘‘ఈ ఏడాది భారీవర్షాలు కురిసినా, ఒక్క చెరువు కూడా తెగలేదు. కానీ, గత ఐదేళ్లలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మలో గేట్లు పని చేయలేదు. పులిచింతలలో గేట్లకు కందెన వేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు 95 శాతం రిజర్వాయర్లు జలాలతో కళకళలాడుతున్నాయి. రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఆరోజే చెప్పా. అదే పట్టుదలతో ముందుకు వెళుతున్నా. మన పెద్దవాళ్లు దేవాలయాలను కట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యమిస్తూ నీటి వ్యవస్థలపై దృష్టి సారించింది. రాయలసీమకు నీళ్లు ఇవ్వవచ్చునని మొట్టమొదట ఆలోచించిన నేత ఎన్టీఆర్. ఆయన ఆలోచనలను అమలు చేస్తున్నాం. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. ఒక వ్యక్తి ‘నా రాయలసీమ’ అంటాడు. కానీ, గత ఐదేళ్లలో సొంత నియోజకవర్గం పులివెందులకు ఆయన నీళ్లు ఇవ్వలేకపోయారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుకు నీళ్లు ఇచ్చాం. వారిది గొడ్డలిపోటు...పులివెందులో రక్తపాతం. మనది హంద్రీనీవా..పులివెందుకు జలపాతం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి వద్ద స్పేస్ సిటీ ఏర్పాటుచేస్తున్నాం. రాయలసీమకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. నేను ఎన్నడూ రాగద్వేషాలతో పరిపాలన చేయను. అయితే, ప్రజలకు హాని కలిగిస్తే మాత్రం ఎలాంటి వ్యక్తినైనా ఢీకొడతాను. ముఠా నాయకులను రాయలసీమలో అణిచివేశాం. హైదరాబాద్‌లో మతవిద్వేషాలను, తీవ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించాం. అందుకే నాపై అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేల్చారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నిందను అప్పట్లో సీఎంగా ఉన్న నాపై వైసీపీ నేతలు వేశారు. వైసీపీ.. ఒక ఫేక్ పార్టీ. వాళ్ల జీవితమే ఫేక్. తుఫాను నా వల్లనే వచ్చిందట! ఇంతకుమించిన ఫేక్ ప్రచారం ఉంటుందా? కర్నూలులో బస్సు ప్రమాదం జరిగితే ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారు. మరో ఘటనలో కమ్మ, కాపుల మధ్య కుల విద్వేషాలు రగిల్చేలా ఫేక్ ప్రచారం చేశారు. వైసీపీకి ఓ కరపత్రం ఉంది. ఓ చానల్ కూడా ఉంది. కానీ ఆ వ్యక్తి(జగన్) బయటకొచ్చి ‘మాకు చానల్ లేదు.. పేప ర్ లేదు’ అంటూ ఫేక్ ప్రచారం చేస్తుంటాడు. తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించక తప్పదు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు ఉరిశిక్ష విధించడమే దీనికి రుజువు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
ఫ్రీ బస్సులో వెళుతున్నారా..
‘‘నా భర్త గంగయ్య కరోనాలో చనిపోయాడు. అప్పటినుంచి టీకొట్టు పెట్టుకుని బతుకుతున్న నా ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పింఛను అందించడం సంతోషంగా ఉంది. మాకుటుంబం పరిస్థితిని అడిగారు. ఫ్రీబస్సులో వెళుతున్నారా అని ఆరా తీశా రు. పెళ్లిళ్లు అయి ఎక్కడో ఉంటున్న కూ తుళ్లను చూడటానికి ఫ్రీ బస్సులోనే వెళుతున్నానని,వాళ్లూ వస్తున్నారని చెప్పాను. ఉచిత సిలిండర్లు అందాయని తెలిపాను.’’
- మేడా రెడ్డెమ్మ, పెద్దన్నవారిపల్లి
హార్మోని వాయించు మల్లయ్యా..
అడిగి మరీ సంగీతాన్ని ఆస్వాదించిన సీఎం
పెద్దన్నవారిపల్లిలో వాయిద్య కళాకారుడు మేడా మల్లయ్య ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఆయనకు పింఛన్ అందజేశారు. తాను వాయిద్య కళాకారుణ్ణని మల్లయ్య చెప్పడంతో. తనకోసం హార్మోనియం వాయించాలని ముఖ్యమంత్రి కోరారు. మల్లయ్య వాయించి వినిపించారు. ఆయన ఆర్థికపరిస్థితిని ఆరాతీస్తూ.. ‘మీ వృత్తి ఎలా ఉంది?’ అని సీఎం ప్రశ్నించారు. గతంలో ఆదరణ ఉండేదని,ఇప్పుడు పనులు లేక ఇబ్బంది పడుతున్నామని మల్లయ్య తెలిపారు.
రియల్ టైమ్‌లో.. ఆదుకున్నాం..
‘‘టెక్నాలజీని ఉపయోగించి మొంథా తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. చీఫ్ సెక్రటరీ నుంచి సచివాలయ సిబ్బంది దాకా అందరూ తుఫాన్ సమయంలో బాగా పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తమై జిల్లా యంత్రాంగంతో కలిసి రియల్ టైంలో పనిచేశారు. అలా పని చేయించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకున్నాం. విపత్తు వస్తుందంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పంటపొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నాం. రియల్ టైంలో పనిచేశాం కాబట్టే గట్టెక్కగలిగాం. తుఫాన్ ప్రభావంతో రూ.5,250 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేసి, నిధులు మంజూరు చేయాలంటూ కేంద్రానికి నివేదికలు పంపిం చాం. ఇదంతా టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్లనే చేయగలిగాం. ఒకప్పుడు నేను సెల్‌ఫోన్ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ ఎగతాళి చేసినవాళ్లు కూడా సెల్‌ఫోన్ వాడుతున్నారు. ఐటీ విప్లవం రాబోతోందని 30ఏళ్ల క్రితమే చెప్పాను. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ నిర్మించడం ద్వారా తెలుగువారిని సాంకేతిక విప్లవంలో భాగం చేశాను. దానివల్ల ఇప్పుడు ప్రపంచంలో తెలుగువాళ్లు లేని దేశం లేదు. ఇప్పుడు మరో విప్లవానికి నాంది పలికాను. అదే డేటా, ఏఐ టెక్నాలజీ. గూగుల్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నాం. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడిని గూగుల్ ఈ ప్రాజెక్టులో పెడుతోంది. కరువు సీమకు కియ పరిశ్రమను తీసుకొచ్చాం.’’
‘స్త్రీశక్తి’ ఫలితాలను చూస్తున్నాం..
‘‘స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇక్కడ ఒక మహిళ టీస్టాల్ పెట్టుకొని జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. గతంలో కుమార్తెల వద్దకు వెళ్లాంటే ప్రయాణ ఖర్చులు భయపెట్టేవి. ఇప్పుడు ఉచిత బస్సులో నెలకోమారు ఆమె తన ఇద్దరు కుమార్తెలను చూసుకుని వస్తోంది. ఇది పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వరం. దీపం-2 కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేలు కేంద్రంతో కలిసి అందిస్తున్నాం.’’
ఘనంగా సత్యసాయి బాబా ఉత్సవాలు
‘‘పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీదాకా ఘనంగా నిర్వహిస్తాం. దీనికోసం మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, కందుల దుర్గేశ్, సత్యకుమార్‌తో కమిటీ వేశాం. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఏపీకి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే తెచ్చాం. కర్నూలు బస్సు దహనం నేపథ్యంలో వాహనాల నేషనల్ పర్మిట్లపై కేంద్రానికి లేఖరాస్తాను. నిబంధనల మేరకు వాటిని జారీ చేయకపోతే ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతుంది.’’