Share News

CM Chandrababu: డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:45 AM

స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు బ్యాంకుల్లో రుణాలిచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.

CM Chandrababu: డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్‌

  • రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలి

  • అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్‌ రావాలి

  • అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

  • మెప్మా-మనమిత్ర యాప్‌ ప్రారంభం

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు బ్యాంకుల్లో రుణాలిచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. గంటల్లోనే రుణాలందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని.. ఇది అమలవుతోందో లేదో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులకు చెప్పారు. తీసుకున్న రుణాలతో వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహించాలని.. వారికి వ్యాపార అవకాశాలు మరింతగా పెరిగేలా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ పెంచాలని పిలుపిచ్చారు. వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌ రావాలన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మహిళా ఉత్పత్తులకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫుడ్‌ బిజినెస్‌, ఆక్వా, టూరిజం వంటి రంగాల్లో ఎలాంటి మార్కెట్‌ ఉంటుందో అన్వేషించి వారికి అవకాశాలు కల్పించాలి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ‘అరకు కాఫీ, మిల్లెట్లు.. ఈ రెండింటి కాంబినేషన్లో డ్వాక్రా మహిళలతో అవుట్‌లెట్లు ఏర్పాటు చేయించే ఆలోచన చేయండి. స్టార్‌ బక్స్‌ తరహాలో ఈ అవుట్‌లెట్ల డిజైనింగ్‌ ఉండాలి.


మునగాకుతో ఉత్పత్తులు చేయవచ్చు, మహారాష్ట్ర తెచ్చిన బ్యాంబూ మిషన్‌ పాలసీపై అధ్యయనం చేయండి. ఆక్వా రంగంలో ఎక్కువ అవకాశాలున్నాయి. గుర్రపు డెక్కతో ఉత్పత్తులు చేయవచ్చు.డ్రోన్లను ఎగరేయడం మొదలుకొని ఎగ్‌కార్ట్‌, ఆక్వాకార్ట్‌, మిల్లెట్‌ కార్ట్‌ వంటివి ప్రయోగాత్మకంగా చేపట్టండి. డ్వాక్రా సంఘాల్లో కూడా పీహెచ్‌డీ చేసిన మహిళలు ఉన్నారు. వారిని గుర్తించి వారి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. టూరిజం రంగంలో హోం స్టేలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలోకి డ్వాక్రా సంఘాలు వచ్చేలా చూడండి’ అని అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ‘మెప్మా-మన మిత్ర’ యాప్‌ను సీఎం ప్రారంభించారు. మెప్మా చేపట్టే కార్యక్రమాలు, కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను, ప్రగ్నా యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.


డ్వాక్రా మహిళకు రూ.1.25 కోట్ల రుణం

నెయ్యి వ్యాపారం చేస్తున్న డ్వాక్రా మహిళ మాధురికి రూ.1.25 కోట్ల బ్యాంకు రుణం మంజూరైంది. సీఎం ఆమెను అభినందించి చెక్కు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ‘గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్‌లోని శ్రీసాయికృష్ణ డ్వాక్రా సంఘం నుంచి వచ్చాను. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. మెప్మా సహకారంతోరూ.కోటీ 25 లక్షల రుణం నాకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా లోన్‌ రావడం ఇదే మొదటిసారి. యర్రబాలెంలో 40 రోజుల్లో వెన్న నుంచి నెయ్యి తీసే యూనిట్‌ సిద్ధమవుతుంది. శ్రీమాధురి ఘీతో పాటు అవని అనే పేరుతోనూ బ్రాండింగ్‌ చేసి బిజినెస్‌ చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Oct 22 , 2025 | 05:46 AM