Share News

AP CM Chandrababu: విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతాం

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:41 AM

గతాన్ని గుర్తుపెట్టుకుంటూ.. ఆ స్ఫూర్తితో భవిష్యత్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, తన రాజకీయ జీవితంలో దానినే ఓ విధానంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

AP CM Chandrababu: విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతాం

  • కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు: చంద్రబాబు.. గతం స్ఫూర్తితో భవిష్యత్‌కు ప్రణాళికలు

  • ప్రజలకు మంచి జరుగుతుందంటే ముందుకెళ్లడమే.. రొటీన్‌కు భిన్నంగా పనిచేస్తే అద్భుత ఫలితాలు

  • అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశా.. కాబట్టే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా: సీఎం

  • చంద్రబాబును ‘30’ అభినందనలతో ముంచెత్తిన అధికారులు, ప్రజాప్రతినిధులు

ఏ విషయంలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తపనతో పనిచేయాలి. అప్పుడు మార్పు కచ్చితంగా వస్తుంది. వినూత్నంగా ఆలోచనలు చేయాలి.. రొటీన్‌కు భిన్నంగా పనిచేస్తే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గతాన్ని గుర్తుపెట్టుకుంటూ.. ఆ స్ఫూర్తితో భవిష్యత్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, తన రాజకీయ జీవితంలో దానినే ఓ విధానంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండిపోకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని స్పష్టంచేశారు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న సమయంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొని దృఢ నిర్ణయాలతో పాలన సాగించానని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చానని, విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చానని తెలిపారు. ‘నేను సీఎం అయిన కొత్తలో రంగారెడ్డి జిల్లాలో 10 ఉన్నత పాఠశాలలు కూడా లేవు. అలాంటి చోట 240 ఇంజనీరింగ్‌ కాలేజీలు తీసుకొచ్చాం. అప్పట్లో రంగారెడ్డి అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉండేది, ఇప్పుడు సుసంపన్న ప్రాంతంగా మారింది.


ఒకప్పుడు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భూములు ఇస్తామంటే కంపెనీలు ముందుకొచ్చేవి కావు. వారిని ఒప్పించి, మౌలిక సదుపాయాలు కల్పించి సంస్థలను ఏర్పాటు చేశాం. హైటెక్స్‌, నాక్‌ వంటి సంస్థలను తెచ్చాం. హైటెక్స్‌ దేశంలోనే పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌గా నిలిచింది’ అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉన్నామని, సీమలో గానీ, హైదరాబాద్‌ సిటీలో గానీ అలా వ్యవహరించబట్టే మార్పు తీసుకురాగలిగామన్నారు.

పేరున్న ప్రముఖులను తీసుకొచ్చి..

ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు జాతీయస్థాయిలో మంచి పేరు ఉన్న ప్రముఖులను తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. నీరు-మీరు, పచ్చదనం-పరిశుభ్రత వంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ వంటి వాళ్లను తీసుకొచ్చి ప్రచారం చేయించామన్నారు. ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలకు అధికప్రాధాన్యం ఇచ్చామని, ఇవి సత్ఫలితాలిచ్చాయన్నారు. ‘అనంతపురం జిల్లాలో పదేళ్లలో 8 ఏళ్లు కరువు ఉండేది. రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దీంతో నాడు ఇన్‌పుట్‌ సబ్సిడీ పెట్టాం. తొలిసారి ఈ విధానం తెచ్చింది మనమే. మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలన్న సంకల్పంతో పనిచేశాం.’ అని చెప్పారు.


సత్యసాయిబాబా కోరితే..

‘పుట్టపర్తి సత్యసాయిబాబా ఒకసారి నన్ను పిలిచి.. అందరినీ పిలిచినట్లే నన్నూ బంగారూ అని పిలిచి.. పుట్టపర్తి చుట్టుపక్కల తాగునీటి సమస్య గురించి మాట్లాడారు. తానే తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తానని.. ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యత చూడాలని కోరారు. నేను సరేనన్నాను.’ అని చంద్రబాబు వివరించారు.

కులవృత్తులకు చేయూత..

ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాళ్లమని, ఆదరణ వంటి పథకాలతో ఎంతో చేయూతనిచ్చామని సీఎం తెలిపారు. ‘నేడు కులవృత్తుల్లో మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా ఆయా వర్గాలకు చేయూతనివ్వాలి. గతంలో సక్సెస్‌ అయిన పాలసీలను అధ్యయనం చేసి, నేటి అవసరాలకు అనుగుణంగా మార్చాలి’ అని సూచించారు. ఆయన్ను కలిసినవారిలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌, డీజీపీ గుప్తా, పలువురు ఐఏఎస్‌లు ఉన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 04:44 AM