CM Chandrababu: రైల్వే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:02 AM
రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచండి.. భూ సేకరణ, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి సహకరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే అధికారులకు హామీ ఇచ్చారు.
భూసేకరణ, రాష్ట్ర వాటా నిధులు విడుదలకు ఇబ్బంది లేదు
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచండి.. భూ సేకరణ, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకి సహకరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే అధికారులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లపై సచివాలయంలో సోమవారం ఆయన రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్, రాయదుర్గం-తుముకూరు మధ్య రైల్వే లైన్లు.. గుణదల-ముస్తాబాద్ బైపాస్ తదితర ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న భూ సేకరణ, నిధులు విడుదల, అనుమతుల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు, తక్షణమే రైల్వే శాఖ చేపట్టాల్సిన చర్యలు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు-అండర్ బ్రిడ్జిల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు పంపిన ప్రతిపాదనలపైనా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం ఏపీలో రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పెట్టుబడులు మౌలిక వసతుల కల్పనపై రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబుకు సీఎం సూచించారు.
పోర్టులకు రైల్వే కనెక్టివిటీ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్ రంగాన్ని భారీగా అభివృద్ధి చేయడానికి రైలు కారిడార్ ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న పోర్టులను రైల్వే కనెక్టివిటీతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, రామాయపట్నం పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. హైదరాబాద్-బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నై-హైదరాబాద్ మార్గాల్లో ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఆలోచనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఖరగ్‌పూర్-చెన్నై మధ్య డెడికేటెడ్ కారిడార్, కొత్తగా 1,564 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలపైనా చంద్రబాబు ఆరా తీశారు. నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి అవసరమైన రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వేశాఖ ప్రతిపాదించిన అమరావతి, గన్నవరం నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి.. విజయవాడ, గుంటూరులో టెర్మినళ్ల విస్తరణకు సమ్మతి తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్లను ఐకానిక్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. విజయవాడ స్టేషన్ రీ డెవల్‌పమెంట్ పనులు వేగవంతం చేయాలని, విశాఖపట్నం స్టేషన్‌ను జ్ఞానాపురం వైపు అభివృద్ధిని చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందని రైల్వే అధికారులకు సూచించారు. అమరావతిలో నిర్మించబోయే కొత్తస్టేషన్‌ను వినూత్నంగా తీర్చిదిద్దాలన్నారు. రూ.271కోట్లతో జరుగుతున్న రాజమహేంద్రవరం స్టేషన్ అప్‌గ్రేడ్ పనులను గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేయాని ఆదేశించారు.