CM Chandrababu: ఆ తప్పు.. మళ్లీ చేయొద్దు
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:36 AM
ఒక్కసారి జరిగిన తప్పునకు రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలి: చంద్రబాబు
అప్పుడే నంబర్ వన్ ఎకానమీగా భారత్
ఆంధ్రప్రదేశ్ దానికి ఇంజన్‌గా ఉంటుంది
అమరావతి అభివృద్ధి యాత్ర మొదలు
రాయపూడిలో సీఆర్‌డీఏ భవంతి ప్రారంభం
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో తొలి భవనమిది
క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ వ్యాలీ,ఏఐ డేటా సెంటర్‌తో మరింత ముందుకు
రాజధాని రైతుల త్యాగాలు, ఆడబిడ్డల అవమానాలు మరచిపోను
త్వరలో రైతులతో ప్రత్యేక భేటీ: సీఎం
గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘ఒక్కసారి జరిగిన తప్పునకు రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 వరకూ కూటమి ప్రభుత్వం ఉండాలన్నారు. అప్పుడే భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ ఎకానమీగా ఆవిర్భవిస్తుందని.. దానికి ఆంధ్రప్రదేశ్ ఇంజన్‌గా ఉంటుందని చెప్పారు. అందుకే పవన్ కల్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు. రాయపూడిలో నిర్మించిన ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 9.55 గంటలకు.. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ.. రాజధాని రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు. సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్, పురపాలక శాఖకు సంబంధించిన అన్ని విభాగాలూ ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మించిన ఈ భవనంలో వాటన్నిటినీ ఆయన పరిశీలించారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో మాట్లాడారు. ఐదేళ్లపాటు వారు. మహిళలు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను చూశానని.. వారి ఇబ్బందులు పోగొట్టి రెట్టింపు గౌరవం కల్పించేలా తోడ్పాటునందిస్తానని భరోసా ఇచ్చారు. తన ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసం, వారి భవిష్యత్ కోసమేనని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే...
ఎక్కడా లేని నగరంగా..
ఒక్క రూపాయి కూడా ప్రజాధనం ఖర్చు చేయకుండా నిర్మించే స్వీయ ఆదాయార్జన నగరం అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని తొలి భవనమైన సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే! ఇక రాజధాని అభివృద్ధి యాత్ర మొదలైౖంది. అమరావతికి క్వాంటం కంప్యూటర్‌ను తీసుకొచ్చా. గ్రీన్ ఎనర్జీ వ్యాలీని తీసుకొస్తున్నా. ఏఐ డేటా సెంటర్ తెస్తున్నా! అప్పుడు హైటెక్ సిటీ తెస్తే.. అవహేళన చేశారు. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అవహేళన చేస్తున్నారు. కానీ ప్రూఫ్ ఆఫ్ కాన్సె్‌ప్టను తయారు చేసుకుని అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలో ఎక్కడా లేని నగరంగా తీర్చిదిద్దుతా! అది భవిష్యత్ నగరం! ఇందుకు కారణమైన రైతులు, ఆడబిడ్డలను ఎప్పటికీ మర్చిపోను. అందుకే ఆ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజూ దేవతల రాజధాని లాంటి రాజధానిని, రాష్ట్రాన్ని నిర్మించే అవకాశాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నా. అమరావతికి స్థల బలం బలంగా ఉంది. అందుకే గత ప్రభుత్వం ఐదేళ్లపాటు వేధించినా దీటుగా నిలబడింది. రాజధాని కోసం మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారు. వారు పడ్డ అవమానాలు, పడ్డ బాధలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. అందుకే రైతుల ఉద్యమానికి మద్దతుగా నేను కూడా జోలె పట్టాను. ఉద్యమానికి అండగా నిలిచాను. కష్టాలు మరచిపోవద్దు. రైతులు చేసిన త్యాగాల ఫలితాలను రైతులే అనుభవించాలి. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. రైతులకు రెట్టింపు గౌరవం దక్కేలా.. రెట్టింపు ఫలాలు అనుభవించేలా చేస్తా. అమరావతి పునాదులు చాలా బలంగా ఉన్నాయి. విశాఖ కూడా అద్భుతంగా అభివృద్థి అవుతోంది. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇక్కడికే వస్తోంది.

భూములు అమ్ముకోవద్దు..
రాజధాని ప్రాంత ప్రజలు భూములు అమ్ముకోవద్దు. గతంలో నేను సైబరాబద్‌లో వాళ్లకూ అదే చెప్పా. హైదరాబాద్‌లో 9 మునిసిపాలిటీలు కలిపి ఒక వడ్డాణంలా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. అప్పుడు రాయదుర్గంలో ఎకరా లక్ష ఉండే భూమి ఇప్పుడు ఎకరా 170 కోట్లు పలుకుతోంది. అదీ అభివృద్ధి ఫలమంటే.. అందుకే ఇక్కడ కూడా భూములు అమ్ముకోవద్దు. ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్క 30, 40 లక్షలు ఎకరాలు సాగు చేసే కృష్ణానది. ఇక్కడేమో బంగారం పండే భూములు.. పచ్చదనం అద్భుతంగా వస్తుంది. అంటే బ్లూ, గ్రీన్ సిటీగా ఉంటుంది. హైదరాబాద్‌లో రోడ్ కింద పైప్ లైన్ వేస్తారు. అది పగిలితే రోడ్‌పై నీరు ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నిటికి ప్రత్యేక డక్టులు ఏర్పాటు చేశాం. ఫ్యూచర్ సిటీ అమరావతి. రాజధాని నుంచి 7 రోడ్లు నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. కాబట్టి రైతులెవరూ భూములు అమ్ముకోవద్దు.
దారి చూపిన రైతులు..
సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం. భూమి కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమరావతి రైతులు నాకు దారి చూపారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చాం. సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన చరిత్ర అమరావతి రైతులదే. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదు. మనమే తెచ్చాం. సక్సెస్ చేశాం. అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాక మొదటిగా సీఆర్‌డీఏ బిల్డింగ్ ప్రారంభమైంది. నాకు సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే! త్వరలో భూములిచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతా. అందరం కలిసి రాజధానిని అభివృద్థి చేసుకుందాం.
