CM Chandrababu Urges: వ్యవసాయాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:55 AM
రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా వ్యవసాయ-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం మరింత సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు...
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా వ్యవసాయ-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం మరింత సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర వ్యవసాయమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని సీఎం అందించారు. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. వ్యవసాయ-అనుబంధ రంగాల్లో 10.70 శాతం వృద్ధి నమోదు చేశామని, ఇందుకోసం పంచ సూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
సీఎం విజ్ఞప్తులివీ..
పీఎం ఆర్కేవీవై-పీడీఎంసీ పథకం కింద సూక్ష్మసాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలి.
అరటి పంట రవాణాలో నష్టాలు తగ్గించేందుకు, మార్కెట్ యాక్సెస్ పెంచేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా అరటి రవాణాకు సబ్సిడీ కల్పించాలి.
కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో కొబ్బరి పార్క్ ఏర్పాటుకు అనుమతివ్వాలి.
పట్టు పురుగుల పెంపకం షెడ్లకు వీబీ జీరామ్‌జీ కింద సాయం చేయాలి.
ప్రకృతి సాగులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యం కల్పించాలి.
పీఎం-ప్రణాం కింద నిధుల విడుదలను వేగవంతం చేయాలి.
ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ(ప్రకృతి సాగు జాతీయ మిషన్) కింద 2026-27 సంవత్సరానికి 10వేల ప్రకృతి సాగు కస్టర్లకు అనుమతివ్వాలి.
2025-26లో మంజూరైన 5వేల కస్టర్ల నిర్వహణ ఖర్చులు కేంద్రం భరించాలి.
రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు అమలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 20వేల అదనపు క్లస్టర్లను కేటాయించాలి.
ప్రకృతి సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ఏపీని ప్రకటించాలి.
విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేయాలి.
పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులివ్వాలి.
ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 20వేల మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకు సేకరణకు రూ.150 కోట్లు సాయం చేయాలి.
రాష్ట్రంలో మామిడి బోర్డు, ఐసీఏఆర్ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు అనుమతివ్వాలి.
ఎన్‌ఎ్‌ఫడీబీ(జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు)ను అమరావతికి తరలించాలి.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకింద సబ్సిడీని 60శాతానికి పెంచాలి.
అమరావతిలో అఖిల భారత రొయ్యల సమాఖ్యను ఏర్పాటు చేయాలి.