CM Chandrababu: పీ4లో బ్యాంకర్లూ భాగం కావాలి
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:40 AM
కుటుంబానికో పారిశ్రామికవేత్తను తయారుచేయడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8 నాటికి (మహిళా దినోత్సవం) లక్ష మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
బడుగులకు సాయాన్ని సిబిల్ స్కోర్‌తో ముడిపెట్టొద్దు
రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వండి
లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం
ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం
అమరావతిలో బ్యాంకుల హెడ్ ఆఫీసులు పెట్టండి
రాజధానిలో ఆర్థిక జిల్లా ఏర్పాటు చేయండి
నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అందించండి
ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ ఉండాలి
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు
‘‘సరైన పత్రాలు లేనివారికి రుణాలు ఇవ్వాలని (ఫాల్స్ లెండింగ్) ఎవ్వరూ సిఫారసు చేయరు. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావు. కానీ, పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గించేందుకు చర్యలు అవసరం. దీనికోసం పీ-4 కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రక్రియలో బ్యాంకర్లు కూడా భాగస్వాములు కావాలి.’’
- చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబానికో పారిశ్రామికవేత్తను తయారుచేయడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8 నాటికి (మహిళా దినోత్సవం) లక్ష మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం సహకరించాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పీ-4 పథకంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్‌ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ సౌకర్య లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను చంద్రబాబు బ్యాంకర్లకు వివరించారు. ’గతంలో వన్ ఫ్యామిలీ- వన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటూ ప్రచారం చేశాం. ఇప్పుడు వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదంతో పని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి లక్ష మంది మహిళలను పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. దీనికి బ్యాంకర్లు సహకరించాలి. 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు ఆనాడు ఏ విధంగా సహకరించారో.. దీనిక్కూడా సహకరించాలి. అలాగే యువత, మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేలా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాం. ఈ హబ్‌లకు ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల ప్రతినిధులను అనుసంధానించాలి’ సీఎం కోరారు. ఉన్నత విద్యకు బ్యాంకర్లు తమ వంతు సాయం అందించాలని, తక్కువ వడ్డీలకు రుణాలివ్వడం, తక్కువ కిస్తీల వెసులుబాటు కలిగించాలని కోరారు.
బ్యాంకర్ల సమావేశాలు ఫలితాలివ్వాలి
బ్యాంకర్ల సమావేశాలు అర్థవంతంగా జరగాలని, ఫలితాలిచ్చేలా ఉండాలని చంద్రబాబు అన్నారు. రొటీన్ సమావేశాల వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ‘‘ఖరీఫ్ సీజన్ ఇప్పటికే సగం గడిచింది. ఈ పాటికే రైతులకు రుణాలివ్వాల్సి ఉంది. ప్రపంచమంతా వేగంగా మారిపోతోంది. బ్యాంకర్లూ మారా లి. జీఎస్టీలో సంస్కరణలను కేంద్రం తెచ్చింది. నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ రిఫార్మ్స్ రావాలి. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించేలా కాకుండా.. ప్రోత్సహించేలా ఉండాలని తెలిపారు. ‘‘పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు.. అన్ని రకాల రవాణా సౌకర్యాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. లాజిస్టిక్స్ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 14ు ఉంది. ఈ వ్యయాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు రావాలి. ఐఐఎఫ్సీఎల్ వంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకర్లు సహకరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలి’’ అని కోరారు.
అమరావతిలో ఆర్థిక జిల్లా ఏర్పాటు
రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. ‘‘బ్యాంకులన్నీ కలిసి ఆర్థిక జిల్లాను ఏర్పాటు చేయాలి. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించండి. బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తాం. రెండేళ్లలో అమరావతిలో బ్యాంకులు తమ కార్యాలయాలను నిర్మించాలి. అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి. వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు’’ అని కోరారు. కౌలు రైతులకు రుణాలివ్వాలని సూచించారు. ‘‘బీసీ,ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలకోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. పీఎం సూర్యఘర్ వంటి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించాలి’’ అని కోరారు.
జూన్ వరకు రూ. 2,47,919 కోట్ల రుణాలు
వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి రూ.6,60లక్షల కోట్ల రుణం లక్ష్యంగా పనిచేస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు. ఇందులో ఈ ఏడాది జూన్ వరకు రూ.2,47,919కోట్ల మేర రుణాలిచ్చినట్లు సీఎంకు వివరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.94,666కోట్లు (లక్ష్యం రూ.3.06లక్షల కోట్లు) ఎంఎ్‌సఎంఈ రంగానికి రూ.49,831 కోట్లు (లక్ష్యం రూ.1.28లక్షలకోట్లు), ప్రాధాన్యతరంగానికి రూ.1,47,641కోట్లు (లక్ష్యం రూ.4.58లక్షల కోట్లు), ప్రాధాన్యేతర రంగానికి రూ.1,00,278 కోట్ల రుణాలిచ్చినట్లు తెలిపారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ నితీశ్ రంజన్, బ్యాంకర్లు పాల్గొన్నారు.