Share News

CM Chandrababu Urges: వేగం పెంచుదాం

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:34 AM

గత ఐదేళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నామని, ఇక పాలనలో వేగం పెంచాలని మంత్రులు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు...

CM Chandrababu Urges: వేగం పెంచుదాం

  • ఇప్పుడే కుదుటపడుతున్నాం

  • టీమ్‌గా విప్లవాత్మక పాలన అందిద్దాం

  • దీనికోసం 7 గ్రూపులు ఏర్పాటు

  • సాగు, ఇతర మౌలిక రంగాలకు చోటు

  • సంక్షేమాన్ని, విద్యను కలపొద్దు

  • అన్ని స్థాయిల అధికారులకూ శిక్షణ

  • సీఆర్డీయే భవనంలో హెచ్‌ఆర్‌డీ కేంద్రం

  • 2029 నాటికి 29 లక్షల కోట్లకు జీఎస్డీపీ

  • మంత్రులు, కార్యదర్శులు కలిసి పనిచేస్తే సత్ఫలితాలు: సీఎం చంద్రబాబు

  • కలెక్టర్ల సదస్సుకు సన్నాహంగా వారితో భేటీ

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నామని, ఇక పాలనలో వేగం పెంచాలని మంత్రులు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు సన్నాహంగా సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, కార్యదర్శులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహనతో ఈ సమావేశాలకు రావాలని ఈ సందర్భంగా సీఎం నిర్దేశించారు. ‘‘జీఎ్‌సడీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) కొన్ని జిల్లాల్లో పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తగ్గుతోంది. ఈ హెచ్చుతగ్గులను సరిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆయా శాఖలు చూసే మంత్రులు, కార్యదర్శులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.’’ అని ఆయన అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు మూడో తరం సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘రాష్ట్రంలో విప్లవాత్మకమైన పాలనను అందిద్దాం. ఇందుకోసం ఏడు పరిపాలనా గ్రూపులను ఏర్పాటు చేయాలి. ఇందులో వ్యవసాయం తదితర మౌలిక విభాగాలు, పరిశ్రమలు, సేవలు, యువజన వ్యవహారాలు-పర్యాటకం, రెవెన్యూ, శాంతిభద్రతలు, ఐటీ ఉంటాయి.’’ అని వివరించారు.

చెప్పిందే చెప్పడం వద్దు.. క్లుప్తత పాటించాలి..

కలెక్టర్ల సదస్సులో చెప్పిందే చెప్పడం కాకుండా.. క్లుప్తంగా అవసరమైన సమాచారం అందించడానికి పరిమితం కావాలని మంత్రులు, శాఖల కార్యదర్శులను సీఎం కోరారు. ‘‘సంక్షేమ రంగాన్ని విద్యారంగంతో కలపవద్దు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహనతో రావాలి.. శాఖలకు సంబంధించిన సమాచారంపై పూర్తి పట్టు కలిగి సదస్సులో మాట్లాడాలి. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సూచించారు.


మరీ అంత ప్రజంటేషన్‌ అక్కర్లేదు..

శాఖలవారీ సమాచారాన్నంతటినీ రెండురోజుల్లోనే చెప్పేయాలన్న ఆత్రుత అవసరం లేదని కార్యదర్శులకు సీఎం సూచించారు. ‘‘పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లలో ఆరు నుంచి పది దాకా స్లయిడ్లు ఇస్తున్నారు. ఈ ఆలోచనా విధానం వదిలేయాలి. ఒకటి లేదా రెండు స్లయిడ్లలోనే క్లుప్తంగా తమ శాఖకు సంబంధించిన వివరాలు అందించాలి. ప్రధానంగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాంఘిక, గిరిజన సంక్షమ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలు, కార్యక్రమాలను గురించి వివరించేలా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఉండాలి. ఒక రంగాన్ని మరో రంగంతో ముడిపెట్టవద్దు.’’ అని తెలిపారు. ఈమేరకు కలెక్టర్ల సదస్సు ఎజెండాలో మార్పులూచేర్పులూ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం హెచ్‌ఆర్‌డీని (మానవ వనరుల అభివృద్ధి విభాగం) తాత్కాలికంగా అమరావతిలో సిద్ధమవుతున్న సీఆర్డీయే భవనంలోని ఒక అంతస్తులో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వచ్చే నెల రెండోతేదీన ఈ భవనం అందుబాటులోకి వస్తుందని, అదే రోజు హెచ్‌ఆర్‌డీ కేంద్రాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.

పాలనలో ప్రజా సంతృప్తే కీలకం

ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతోపాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ‘‘ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధిరేటు సాధించాం. 2029 నాటికి జీఎస్డీపీ రూ.29 లక్షల కోట్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. గత ప్రభుత్వం హయాంలో 3 శాతం వృద్ధి తగ్గిన కారణంగా రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపద కోల్పోయింది.’’ అని తెలిపారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున ఐదేళ్లలో 25 కలెక్టర్ల సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.


విభిన్నంగా నిర్వహిద్దాం..

ఈసారి జిల్లా కలెక్టర్ల సదస్సును విభిన్నంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాలవారీగా జవాబుదారీతనం ఉండేలా సదస్సు నిర్వహించనున్నామని, ఎనిమిది అంశాలపై సమీక్షిస్తామని తెలిపారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని ఆర్టీజీఎస్‌ ద్వారా వెనక్కి తీసుకొచ్చే ఆపరేషన్‌ విజయవంతమైందన్న సీఎం...మంత్రి లోకేశ్‌సహా అధికారుల కృషిని అభినందించారు. ఆర్బిట్రేషన్‌ (మధ్యవర్తిత్వం) ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. మూడో తరం సంస్కరణలపై మరింత అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కమిటీవేయాలని సీఎం ఆదేశించారు.

కలెక్టర్ల సదస్సు షెడ్యూల్‌..

కలెక్టర్ల సదస్సు మొదటి రోజు జీఎస్డీపీ, సంక్షేమం, సూపర్‌ సిక్స్‌, అన్న క్యాంటీన్లు, పీ4 అంశాలతోపాటు లాజిస్టిక్స్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజంటేషన్‌; స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్‌ ఎకానమి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర అంశాలు ఉంటాయి. రెండోరోజు... మానవ వనరుల అభివృద్ధి, వైద్యఆరోగ్యం, విద్య, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఐటీ, క్వాంటమ్‌ వ్యాలీ, వాట్సాప్‌ గవర్నెన్స్‌, డేటాలేక్‌, ఏఐ తదితర అంశాలతోపాటు, రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్‌, వాణిజ్యపన్నులు, మైనింగ్‌, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలు ఉంటాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

పీయూశ్‌ కుమార్‌కు అభినందన..

రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరగడంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (ఫైనాన్స్‌) పీయూశ్‌కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో ప్రజలకు సులభతరమైన పాలనా విధానాన్ని అందుబాటులోకి తెద్దామని నిర్దేశించారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేపని లేకుండా వాట్సప్‌ గవర్నెన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని కోరారు.

Updated Date - Sep 14 , 2025 | 03:34 AM