Share News

CM Chandrababu Urges: నేరాలు 33 శాతం తగ్గాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో నేరాలు 4శాతం తగ్గాయి.. ఇది సరిపోదు.. 33శాతం తగ్గాలి..’ అని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో...

CM Chandrababu Urges: నేరాలు 33 శాతం తగ్గాలి

  • సైబర్‌ నేరగాళ్ల కంటే పోలీసులు అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి

  • యూరియాపై అమెరికా నుంచే 750 వరకూ ఫేక్‌ పోస్టులు

  • ప్రభుత్వానికి, రైతులకు మధ్య వైరం పెంచేందుకు యత్నాలు

  • శాంతిభద్రతల్లో రాజీ పడం: ఎస్పీలతో సీఎం

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో నేరాలు 4శాతం తగ్గాయి.. ఇది సరిపోదు.. 33శాతం తగ్గాలి..’ అని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రెండో రోజైన మంగళవారం ఆయన శాంతిభద్రతలపై సమీక్షించారు. నేరాల నియంత్రణ, డ్రగ్స్‌ నివారణ, సైబర్‌ నేరాల కట్టడికి అధునాతన సాంకేతికత మొదలుకొని పోలీసు జాగిలాల సేవల వరకూ అన్నీ వినియోగించాలని సూచించారు. నేర నియంత్రణలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే పోలీసు శాఖలో టెక్నాలజీతో పాటు సృజనాత్మకతను అమలు చేయడం అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని శక్తులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వైరం పెంచేందుకు విదేశాల నుంచి ప్రయత్నించాయని వెల్లడించారు. యూరియా సమస్యపై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌, యూకే నుంచి సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఒక్క అమెరికా నుంచి 750 వరకూ ఫేక్‌ పోస్టులు చేసినట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించిందని తెలిపారు. ఇలాంటి శక్తుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కుట్రలు చేసేవారికి చట్టపరంగా తగిన బుద్ధి చెప్పాలని ఎస్పీలకు సీఎం సూచించారు. శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని, నేరం చేసిన వ్యక్తి ఎవరైనా జైల్లో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నేరం జరిగిన గంటలోపే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని క్రైమ్‌ సీన్‌ పాడవ్వక ముందే ఆధారాలు సేకరిస్తే శిక్షల శాతం పెరిగి నేరాలు తగ్గుతాయన్నారు. అందుకే ఏపీ పోలీసు శాఖ ప్రతి పోలీసు సబ్‌ డివిజన్‌కు క్రైమ్‌ స్పాట్స్‌ను ఏర్పాటు చేసిందని, జిల్లాల్లో వాటిని వినియోగించుకుని నేరాల శాతాన్ని బాగా తగ్గించాలని సూచించారు. ‘వివేకా హత్య కేసులో ఒక సీఐ రక్తం మరకల్ని కడిగించడం దారుణం. క్రైమ్‌ సీన్‌ నాశనం చేయడం నేరం.. సెన్సిటివ్‌ కేసుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాం. అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసు, డాక్టర్‌ సుధాకర్‌పై దాడి వేధింపుల కేసు, తోట చంద్రయ్య హత్య కేసు, అమర్నాథ్‌ గౌడ్‌ సజీవ దహనంలాంటి ఘటనలు వెలికితీసి పకడ్బందీగా దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా బాధితులకు ఉపశమనం కల్పించాలి’ అని పోలీసు శాఖకు సీఎం నిర్దేశించారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో నేరాలు కట్టడి చేయడం సాధ్యమవుతోందని, వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు స్పందిస్తూ తమ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని, నిర్వహణ విషయంలో పంచాయతీల సహకారం అవసరమన్నారు. ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం చేసి పోలీసులకు తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నేరాల కట్టడికి టెక్నాలజీ ఉపయోగించిన విధానం.. ఏఐ హ్యాకథాన్‌ ద్వారా 12సమస్యలకు పరిష్కారం.. ఏలూరులో మొదలైన ఏఐ ఎఫ్‌ఐఆర్‌(ధర్మ ఏఐ) విధానం రాష్ట్రమంతా అమలు చేయడంపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా వివరించడంతో చంద్రబాబు అభినందించారు.

Updated Date - Sep 17 , 2025 | 04:05 AM