CM Chandrababu Unveils: లాభసాటి సాగుకు పంచసూత్రాలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:02 AM
రాష్ట్రంలో లాభసాటి సాగుతో ప్రతి అన్నదాతను మీసం మెలేసేలా చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికిగాను పంచసూత్రాలను పాటించాలని రైతన్నలకు సూచించారు. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు అందరి భవిష్యత్తు ముఖ్యమని ఉద్ఘాటించారు...
ప్రతి రైతు మీసం మెలేసేలా చేస్తా: సీఎం
వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తా. తెగులు సోకిన మొక్కకే మందు పిచికారీ చేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. వాయు నాణ్యత ఎలా ఉంది? తెగుళ్లు, పురుగుల ప్రభావం ఎంత ఉంది? గాలి ఎటు వైపు వీస్తోందో చెప్పే టెక్నాలజీని తీసుకువస్తా. సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులు మీసం మెలేసేలా చేస్తా.
- సీఎం చంద్రబాబు
విధ్వంసం, ఆటవిక పాలన చేసేవారు ఇక ఎన్నడూ అధికారంలోకి రాకూడదు
అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
నాకు సహకరించండి.. రాష్ట్రాన్ని, రైతులను ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసి చూపిస్తా
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేశాం
కమలాపురం సభలో సీఎం చంద్రబాబు
‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల
46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు జమ
కడప/అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాభసాటి సాగుతో ప్రతి అన్నదాతను మీసం మెలేసేలా చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికిగాను ‘పంచసూత్రాల’ను పాటించాలని రైతన్నలకు సూచించారు. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు అందరి భవిష్యత్తు ముఖ్యమని ఉద్ఘాటించారు. విధ్వంసం, ఆటవిక పాలన చేసే వారిని అధికారంలోకి శాశ్వతంగా రాకుండా చేయాలన్నారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో తనకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని, రైతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం భైరవగుట్ట వద్ద బుధవారం ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ రెండో విడత నిధులను సీఎం విడుదల చేశారు. 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,135కోట్లు జమ చేశారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
సుపరిపాలనకు నాంది పలికాం!
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేశాం. 17 నెలల కాలంలో సూపర్‌సిక్స్‌ను సూపర్‌హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ్త్రశక్తి ఉచిత బస్సు, దీపం-2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం జయప్రదం చేసింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి చాలా బాగుంది. ఇక్కడ మంచి ఆక్సిజన్ కూడా ఉంది. అలాంటి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. చెక్ చేసుకోండి.
రైతన్న బతుకు మారాలి..
రైతన్నలు సాగుతీరు మార్చుకోవాలి. వ్యవసాయం లాభసాటికావాలి. అన్నదాత బతుకుమారాలి. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయంలో ఏ రాష్ట్రం ముందుంటుందో ఆ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. నేను కూడా రైతు బిడ్డనే. అందుకే.. సాగులో పంచ సూత్రాలు పాటిస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనం పండించే పంట మన ఊరిలో అమ్మడం కాదు.. ప్రపంచమే వేదికగా విక్రయిస్తే.. రైతులు నిలదొక్కుకుంటారు. దీనికిగాను ఫుడ్ ప్రాసెసింగ్‌కు వెళ్లాలి. ఈ విధానాల్లో ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమమే ఇపుడు చేస్తున్నాం. ఆధునిక విజ్ఞానాన్ని మీకు అందుబాటులో ఉంచుతాం. ప్రతి ఏకరాకు నీరు ఇవ్వాలన్నదే నా సంకల్పం. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లలో నీళ్లు పెట్టగలిగితే ఒక ఏడాది వర్షాలు పడకపోయినా మరో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది. భూగర్భ జలాలు కూడా పెంచాలి. భూమినే ఒక జలాశయంగా తయారు చేయాలి.
అందరూ ప్రకృతి సేద్యానికి మళ్లాలి
రైతులు ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. క్రిమిసంహారక మందులు తగ్గాలి. అందరూ ప్రకృతి సేద్యానికి మళ్లాలి. గతేడాది 12 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం ద్వారా పండించాం. ఈ ఏడాది మరో 6 లక్షలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యవసాయ రంగంలో కొత్త విధానాలను తీసుకురావాలి. అగ్రిటెక్ కోసం బిల్‌గేట్స్ ఫౌండేషన్ నుంచి సహకరించేందుకు ముందుకొస్తున్నారు. డ్రోన్, సెల్‌ఫోన్, సాటిలైట్ వ్యవస్థలను వ్యవసాయానికి అనుసంధానిస్తాం. డ్రోన్‌లు వినియోగించి పురుగుమందును పిచికారీ చేస్తున్నారు. అయితే డ్రోన్‌లో కెమెరా కొట్టి ఏ మొక్కకు పురుగు ఉందో ఆ మొక్కకు మందు కొట్టే టెక్నాలజీ రావాలి. అదే నా టార్గెట్.
రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి
రాయలసీమలో 18 నుంచి 20 వరకు అనేక రకాల పండ్ల తోటలు ఉన్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడకు వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే పరిస్థితి తీసుకొస్తా. కోల్డ్‌చైన్ లింక్ ద్వారా దేశంలో ఎక్కడ మార్కెట్ బాగుందో అనలైజ్ చేసి నేరుగా పంపించే మెకానిజం ఏర్పాటు చేస్తున్నాం. దుబాయ్, అబుదాబీలతో మాట్లాడుతున్నా. వాళ్లను ఇక్కడ పెద్ద ఫుడ్ పార్క్ పెట్టమన్నా. అగ్రికల్చర్‌లో కూడా టెక్నాలజీ తీసుకొస్తా.
త్వరలో సంజీవని ప్రాజెక్టు
త్వరలో సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. అన్ని రకాల వైద్య పరీక్షలు ఇంటి వద్దకే వచ్చి చేస్తాం. అవసరమైతేనే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి తెస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎ్‌సఎంఈ పార్కులు పెడతా. రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది. అన్ని విషయాలు ఈజీగా చేయగలుగుతాను. కానీ, వ్యవసాయం మాత్రం సంక్లిష్టంగా ఉంది. అయినా సవాలుగా తీసుకుంటా. రైతులను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా.
ట్రాక్టరెక్కిన సీఎం
పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లెలో ట్రాక్టరు ఎక్కిన సీఎం చంద్రబాబు రైతులతో కలిసి ముచ్చటిస్తూ.. వ్యవసాయ క్షేత్రం పరిశీలనకు వెళ్లారు. సీఎంకు మహిళా రైతులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉద్యాన పంటలను పరిశీలించిన సీఎం సంతోషం వ్యక్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా జీవ ఎరువులు, పురుగు మందు పిచికారీ చేసే విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు.
ఒకేసారి 7 వేలు
99% ఖాతాలకు చేరిన సొమ్ము
రాష్ట్ర రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.7 వేల సొమ్ము పడింది. పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకాల కింద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బటన్ నొక్కిన స్వల్ప వ్యవధిలోనే సొమ్ము నేరుగా ఖాతాల్లో జమయింది. బుధవారం మధ్యాహ్నం కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ పీఎం కిసాన్, కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాలకు బటన్ నొక్కారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,135కోట్లు జమ అయ్యాయి. పీఎం కిసాన్ సొమ్ము రూ.2వేలు, అన్నదాతసుఖీభవ రెండో విడత సొమ్ము రూ.5వేలు లబ్దిదారులైన ఖాతాల్లో పడ్డాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు 99శాతం మంది రైతుల ఖాతాలకు నగదు జమ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గత వైసీపీ హయాంలో రైతు భరోసా పథకం కింద అప్పటి సీఎం జగన్ బటన్ నొక్కినా.. రోజుల తరబడి నగదు జమ కాని పరిస్థితులు ఉండేవని రైతులు గుర్తు చేస్తుకుంటున్నారు.