Share News

Pension Distribution: మా ఇంటికి సీఎం సార్‌ వస్తున్నారు

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:43 AM

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వస్తున్నారు.

Pension Distribution: మా ఇంటికి సీఎం సార్‌ వస్తున్నారు

  • శ్రీసత్యసాయి జిల్లాలో లబ్ధిదారుల ఆనందం

  • నేడు పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

పుట్టపర్తి, కదిరి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వస్తున్నారు. గ్రామంలో చింతలయ్య, రెడ్డెమ్మ, మేడా మల్లయ్య ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లను అందజేస్తారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి వస్తున్నారని తెలుసుకుని లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి చంద్రబాబు శనివారం ఉదయం 11.15 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లికి మధ్యాహ్నం 12.45కి చేరుకుంటారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్‌లను అందజేసిన తరువాత గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రజా వేదికలో సీఎం అడిగి తెలుసుకుంటారు. అనంతరం టీడీపీ శ్రేణులతోనూ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. పెద్దన్నవారిపల్లి నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి లండన్‌కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, మంత్రి సవిత, జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీశ్‌ కుమార్‌, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి హంగు, అర్భాటం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Nov 01 , 2025 | 04:43 AM