Share News

CM Chandrababu: గూగుల్‌ రైడెన్‌తో రేపు ఒప్పందం

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:41 AM

గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో మంగళవారం ఒప్పందం చేసుకునేందుకు ఢిల్లీ వెళుతున్నానని, ఇది తన రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: గూగుల్‌ రైడెన్‌తో రేపు ఒప్పందం

  • 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్‌ పూర్తి

  • దేశంలోనే అతిపెద్ద డేటా హబ్‌గా విశాఖ

  • విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం

  • ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం

  • గత తప్పిదాలు పునరావృతం కానివ్వను

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో మంగళవారం ఒప్పందం చేసుకునేందుకు ఢిల్లీ వెళుతున్నానని, ఇది తన రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2029 నాటికి విశాఖపట్నంలో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం పూర్తి చేస్తారని చెప్పారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని, ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా గూగుల్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ హబ్‌గా మారబోతోందని అన్నారు. ఓ వైపు డేటా సెంటర్‌ మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తుంటే వాటిని అడ్డుకునేందుకు కొందరు బెదిరింపులకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. నవంబరులో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.


పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం

పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్త తరాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, యువతరానికి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు పార్టీ కార్యాలయంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 15 ఏళ్లు సీఎంగా ఉండటం గొప్ప విశేషమని ప్రధాని తనకు ఫోన్‌ చేసి చెప్పినప్పుడు, మీరు 25 ఏళ్లు ప్రభుత్వాధినేతగా (ముఖ్యమంత్రి-ప్రధాని) ఉండటం ఇంకా గొప్ప విశేషమని మోదీకి చెప్పానని అన్నారు. రాష్ట్రంలో వైకుంఠపాళి విధానం వల్ల కొన్నిసార్లు అధికారానికి దూరమయ్యానని చెప్పారు. తాను అధికారానికి దూరంగా ఉండటంలో ప్రజల తప్పు లేదని, తానే కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పరిపాలన చేశానే తప్ప మరేదీ ఆలోచించలేదని, ఇప్పుడు పరిపాలనతో పాటు రాజకీయం కూడా చేస్తున్నానని అన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.

Updated Date - Oct 13 , 2025 | 05:54 AM