CM Chandrababu: ‘మీ కోసం’లో నేనూ పాల్గొంటా
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:53 AM
అన్నదాత కోసం ఈ నెల 24న చేపట్టనున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులూ హాజరుకావాలి
నా లేఖను ప్రతి రైతు ఇంటికీ అందించాలి
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టిపెట్టాలి
ఫార్మర్ యాప్‌తో అన్నదాత చెంతకు సాంకేతికత
వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): అన్నదాత కోసం ఈ నెల 24న చేపట్టనున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ‘‘ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్నా.. మీకోసం’లో నేనూ పాల్గొంటా. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలి. రైతు సేవా కేంద్రాల పరిధిలోని ప్రతి రైతు ఇంటికీ సీఎం లేఖను అందించడంతో పాటు వ్యవసాయాభివృద్ధికి నిర్ధేశించిన పంచసూత్రాలను వివరించాలి. వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్‌ను ప్రతి రైతుకూ చేరువచేయాలి’’ అని సీఎం నిర్దేశించారు. కాగా, రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల అంశంలో సీసీఐ అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసినా రైతులు ఇబ్బందులు పడటంపై ఆరాతీశారు. ఎట్టి పరిస్థితుల్లో పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. అరటి ధర పడిపోకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
జోన్ పరిధిలో పత్తి ఎక్కడైనా అమ్ముకోవచ్చు: సీసీఐ
గుంటూరు సిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఇండియా(సీసీఐ) శుభవార్త చెప్పింది. రైతు పండించిన పత్తిని ఎక్కడైనా అమ్ముకునేలా నిబంధనలు సడలించినట్టు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పటి వరకు రైతు తాను పండించిన పత్తిని ఆ మండల పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలోనే అమ్ముకునే అవకాశం ఉండేది. దానివల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు చాలా నష్టపోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రైతుకు మేలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 843ను తీసుకొచ్చింది. అందులోని 23వ నిబంధన ప్రకారం.. రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట పత్తిని అమ్ముకోవచ్చు. ఈ జీవోను సీసీఐ తుంగలో తొక్కిన సంగతిని మార్కెటింగ్ అధికారులు, ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం ప్రతినిధులు ఆ సంస్థ సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎండీ ఆదేశాలతో రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట పత్తిని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ సీసీఐ సైట్‌లో మార్పులు చేశారు.