CM Chandrababu Naidu: మహిళల ఓటుబ్యాంకు మనదే కావాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:51 AM
డబ్బుతోనే ఎన్నికల్లో గెలవగలమని కొందరు భావిస్తుంటారని, కానీ మనం చేసే మంచి పనులను ప్రజలకు నిత్యం వివరించడం ద్వారా మాత్రమే మన విజయావకాశాలను...
డబ్బుతోనే ఎన్నికల్లో గెలవలేం!
చేసిన మంచి ప్రజలకు నిత్యం చెప్పుకోవాలి
అప్పుడే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి
టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): డబ్బుతోనే ఎన్నికల్లో గెలవగలమని కొందరు భావిస్తుంటారని, కానీ మనం చేసే మంచి పనులను ప్రజలకు నిత్యం వివరించడం ద్వారా మాత్రమే మన విజయావకాశాలను మెరుగుపరచుకోగలమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహిళల ఓటు బ్యాంకు మెజారిటీ మనకే వచ్చేలా చూడాలని, ఇందుకోసం కార్యకర్తలు బాధ్యతతో, సమన్వయంతో పని చేయాలని సూచించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు హాజరైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన ‘కాపీ కబుర్లు’ నిర్వహించారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఇస్తున్నామని, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం వంటి పథకాల అమలు గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని వారిని కోరారు. ‘ప్రతి పోలింగ్ బూత్‌లో బలాబలాలు చూసుకోవాలి. ప్రతి బూత్‌లో మనం బలోపేతం కావడానికి ప్రయత్నం చేయాలి. బలహీన నియోజకవర్గానికి బలమైన నేత ఉంటే నియోజకవర్గం బలపడుతుంది.’ అని వ్యాఖ్యానించారు.
శిక్షణ కార్యక్రమాలపై ఆరా..
శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయో చంద్రబాబు నేతలను అడిగి తెలుసుకున్నారు. పనిచేయడం ఒక ఎత్తయితే, చేసిన పని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తని వ్యాఖ్యానించారు. ‘ఎన్టీఆర్ హయాంలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఎర్రటి ఎండలో చెట్ల కింద నిర్వహించేవాళ్లం. ఇప్పుడు చల్లటి ఏసీ గదుల్లో జరుపుతున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకోవాలి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ప్రతి కార్యకర్తకు తెలియాల్సిన అవసరముంది. నేతలు, కార్యకర్తలను కలిసేందుకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. గతంలో టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ పీక్స్‌కు వెళ్లింది’ అని గుర్తుచేశారు.