CM Chandrababu Sets Jan 15 Deadline: డెడ్‌లైన్ జనవరి 15
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:15 AM
ప్రభుత్వ పరిపాలన మొత్తం జనవరి 15లోగా ఆన్‌లైన్ కావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్‌లైన్. విధించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజల్లో సంతృప్తి స్థాయి 80 శాతానికి చేరుకోవాలని టార్గెట్ పెట్టారు.....
జిల్లా స్థాయిలోనూ ఈ-ఆఫీస్ ఫైల్సే
మాన్యువల్‌గా పెడితే చర్యలు తప్పవు
ఫైళ్ల క్లియరెన్స్ సగటున 15 రోజుల్లో పూర్తి కావాలి
కేటాయించిన బడ్జెట్‌తోనే సరిపెట్టుకోవాలి
అదనపు నిధులు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పరిపాలన మొత్తం జనవరి 15లోగా ఆన్‌లైన్ కావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్‌లైన్. విధించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజల్లో సంతృప్తి స్థాయి 80 శాతానికి చేరుకోవాలని టార్గెట్ పెట్టారు. ‘రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం. పరిపాలనలో బిజినెస్ రూల్స్ ఎందుకు సవరించకూడదు? కొందరు అధికారులు ఫైళ్లు త్వరగా పరిష్కరించడం లేదు. పైగా ఉన్న ఫైళ్లనే కిందకూ పైకీ తిప్పుతూ కొత్త ఫైళ్లు సృష్టిస్తున్నారు. అందుకే బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కమిటీని నియమించి సవరణలు చేద్దాం’ అని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రభుత్వ శాఖల పనితీరుపై పాజిటివ్ రేటు, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్‌పై బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన కీలక సమీక్షలు జరిపారు. ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లు, హెచ్‌వోడీల ఫైళ్ల క్లియరెన్స్ డేటా మొత్తాన్ని ఆయన ముందుంచారు. దానిని పరిశీలించిన చంద్రబాబు.. వారందరికీ క్లాసు తీసుకున్నారు. రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్ పెట్టడం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర స్థాయిలోనేగాక జిల్లా స్థాయిలోనూ ఎక్కడా మాన్యువల్ ఫైళ్లు ఉండకూడదని, జిల్లాల్లో ఈ-ఆఫీస్ ఫైల్స్ మాత్రమే ఉపయోగించాలని స్పష్టంచేశారు. జనవరి 15లోగా ఆన్‌లైన్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ కేసులు ఉపసంహరించాలని వచ్చిన విన్నపాలకు సంబంధించిన ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్‌లో సమస్యలు వస్తున్నాయని భాస్కర్ తెలిపారు. మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి(రవాణా), కొల్లు రవీంద్ర(ఎక్సైజ్, గనులు), నాదెండ్ల మనోహర్ (పౌరసరఫరాలు)కు సంబంధించిన ఈ-ఆఫీస్ లాగిన్‌లో విజిలెన్స్ కేసుల ఫైళ్లు ఎక్కువగా ఉంటున్నాయని.. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వద్ద డబ్బులకు సంబంధించిన ఫైళ్లు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
దీనిపై చంద్రబాబు స్పందింస్తూ.. విజిలెన్స్ కేసుల ఫైళ్లు, సాధారణ ఫైళ్లను వేర్వేరు చేయాలని ఆదేశించారు. ‘రేపు నేను మంత్రులందరినీ పిలిచి, దీనిపై సమీక్ష చేసి.. పూర్తిస్థాయిలో గైడ్‌లైన్స్ ఇస్తాం. మంత్రి, సెక్రటరీ, కలెక్టర్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. 15 రోజులకు మించి ఎవరి వద్దా ఫైళ్లు ఉండడానికి వీల్లేదు. పయ్యావుల వద్ద 11 రోజులుంటున్నాయి’ అని తెలిపారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని ప్రశ్నించారు. ఉదాహరణకు ఒక రిజిస్ర్టేషన్ జరిగిన తర్వాత మళ్లీ ఆ డాక్యుమెంట్ల కోసం జనం ఆఫీసుకు రాకూడదని.. పోస్టు ద్వారా మనమే వాటిని ఇంటికి పంపాలని తెలిపారు. సీఎం ఇంకా చెప్పారంటే..
నిధులపై సెన్సిటివ్‌గా ఆలోచించాలి..
ప్రతి శాఖ అధికారులూ తమ శాఖకు కేటాయించిన బడ్జెట్‌లోనే ఖర్చు పూర్తి చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సిబ్బంది జాప్యం చేస్తుంటే కార్యదర్శులదే బాధ్యత. క్రియాశీలంగా ఉన్న సెక్రటరీలు ఒకట్రెండు రోజుల్లోనే క్లియర్ చేస్తున్నారు. సెక్రటరీల్లో యువరాజ్ ఒక్కడే ఆలస్యంగా చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఫైళ్ల క్లియరెన్స్‌కు 12 రోజులు తీసుకుంటున్నారు. సాంఘిక సంక్షేమం, ఐ అండ్ ఐ శాఖలు కూడా 11 రోజుల చొప్పున తీసుకుంటున్నాయి. చేనేత, టెక్స్‌టైల్స్ కమిషనర్ రేఖారాణికి వచ్చే ఫైళ్లే తక్కువ. అయినా 11 రోజులు ఎందుకు తీసుకుంటున్నారు? క్లియరెన్సులో చివరిలో ఉండే ప్రతి ఒక్కరూ ఇకపై ప్రతి సమావేశంలో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. లీడర్ ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తే అందరూ అదే ఫాలో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్మార్ట్ వర్క్ చేయాలి. సాయత్రం 5 తర్వాత ఎవ్వరూ పని చేయాల్సిన అవసరం కూడా లేదు.
జిల్లాల్లో పర్యటించాలి
వచ్చే 3 నెలల్లో సంతృప్త స్థాయి 80 శాతానికి చేరుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేశాం. కొన్ని శాఖలు 90 శాతానికి చేరుకోవాలి. మంత్రులు, సెక్రటరీలు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. ప్రజల్లో సంతృప్త స్థాయి పెంచడానికి మీరు చేయాల్సిన పని ఇదే. ఇక్కడే కూర్చుని మాట్లాడితే పాజిటివ్ రేటు పెరగదు. మంత్రులందరూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందే. 3 నెలల్లో ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగుపరచుకోవాలి.
పెన్షన్ పంపిణీ భేష్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై దృష్టి పెట్టాం. వాటి పంపిణీ బాగుంది. వినూత్నంగా చేస్తున్నాం. పెన్షన్ పంపిణీలో అవినీతి లేదని 90ు మంది, ఇంటి వద్దనే ఇస్తున్నారని 93ు మంది చెప్పారు. అధికారుల ప్రవర్తనపై సంతృప్తి 83 శాతానికి వచ్చింది. ఇది 90 శాతం దాటాలి. అన్న క్యాంటీన్ల విషయంలో పాజిటివ్ రేటు కొద్దిగా తగ్గుతోంది. వరుసగా 86, 81, 80కి వచ్చారు. ఈ రెండూ బాగా చేస్తున్నారు. కొన్ని శాఖలు సరిగా పని చేయడం లేదు. ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు.
సర్వే వివరాలు..
16 శాఖలకు సంబంధించి 21 అంశాలపై సర్వే చేస్తున్నామని సమాచార-పౌరసంబంధాల కమిషనర్ విశ్వనాథన్ సీఎంకు తెలిపారు. ‘ప్రజల్లో సంతృప్త స్థాయి 71.57ు ఉంది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇప్పుడు 75 శాతం ఉంది. 80 శాతం పాజిటివ్ రేటు లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్న క్యాంటీన్లకు సంబంధించి చిత్తూరు జిల్లా 84.6 శాతంతో ముందుంది. 77 శాతంతో కర్నూలు చివరి స్థానంలో ఉంది. పంచాయతీరాజ్‌లోని సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్‌లో గుంటూరులో సంతృప్తి 72.7ు ఉండగా.. అన్నమయ్య జిల్లాలో 49.5 శాతమే. రేషన్ తీసుకునేవారి సంఖ్య 70.7 నుంచి 82 శాతానికి పెరిగింది. నాణ్యతపై 80.5 శాతం సంతృప్తి పెరిగింది’ అని చెప్పారు.
దీపం-2లో గ్యాస్ డెలివరీ బాయ్ ప్రవర్తన 81 శాతానికి పెరిగింది. డబ్బులు డిమాండ్ చేయడం లేదని 60.3 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో కృష్ణాలో సంతృప్తి ఎక్కువగా ఉంది. కర్నూలులో తక్కువుంది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఇబ్బంది ఉందా అంటే లేదన్న వారు 71 శాతం నుంచి 80 శాతానికి పెరిగారు. పోలీసు స్పందనపై సంతృప్తి 68 శాతానికి పెరిగింది.
రాష్ట్రంలో గంజాయి తగ్గిందా అని అడుగగా.. లేదన్నవారు 79 శాతానికి పెరిగారు. డ్రగ్స్ విషయంలో పోలీసు స్పందన 62 శాతానికి పెరిగింది. ఆలయాల్లో దర్శనం సంతృప్త స్థాయి 71 శాతానికి పెరిగింది. గత నెలలో 76 శాతం ఉంది.
రెవెన్యూ విభాగంలో.. ఎఫ్ లైన్ కట్టిన వెంటనే నోటీసు వస్తోందా లేదా అని ప్రశ్నించగా 71 శాతం మంది వస్తోందని చెప్పారు. డబ్బులు అడగడం కూడా 75.7 శాతానికి తగ్గిపోయింది. కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని 55 శాతం మంది చెప్పారు. సర్వే సర్టిఫికెట్ ఇస్తున్నారని 55 శాతం మందే చెప్పారు. మ్యుటేషన్లపై క్షేత్రస్థాయికి వచ్చి విచారణ చేస్తున్నారని 65 శాతం మంది చెప్పారు.