CM Chandrababu Strategic Edge: రాష్ట్రం కోసం బాబు స్వార్థం
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:45 AM
వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు... సంకీర్ణ సర్కారులో తెలుగుదేశానిదే కీలక పాత్ర! అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి....
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని ధోరణి
వాజపేయి హయాంలో అత్యధిక లబ్ధి.. భారీగా ప్రాజెక్టులు, నిధులు, గ్రాంట్లు
ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల్లో 40శాతం ఏపీకే.. 30శాతం గ్రాంట్‌ను 100శాతంగా మార్చుకున్నారు
ఆయన సామర్థ్యం, రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి.. ‘నో, మినిస్టర్’లో ఆసక్తికర అంశాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు... సంకీర్ణ సర్కారులో తెలుగుదేశానిదే కీలక పాత్ర! అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్లకు బాగా తెలుసు! నాటి రాజకీయ పరిస్థితులను, కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకుని.. ఏపీకి గరిష్ఠ లబ్ధి చేకూర్చారని, చంద్రబాబు అడిగింది వాజపేయి కాదనకుండా చేశారనీ చెబుతారు. ఇప్పుడు... కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అవే విషయాలను ‘నో, మినిస్టర్’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరాల్లో పొందుపరిచారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోరన్నారు. అప్పట్లో రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా తపన పడేవారో వివరించారు. సుభాష్ ఏపీలో ఎప్పుడూ పనిచేయలేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమిక్ ఎఫైర్స్ (డీఈఏ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి సుభా్‌షచంద్ర గార్గ్ పేర్కొన్న కొన్ని ఆసక్తికరమైన అంశాలివి...
అన్నీ ఆంధ్రాకే...
1999-2000 కాలంలో ప్రపంచబ్యాంకు ఆమోదించిన మొత్తం ప్రాజెక్టుల్లో 40 శాతం కంటే ఎక్కువగా చంద్రబాబు ఏపీకి తరలించుకుపోయారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు అన్నీ ఏపీ కోసమే పనిచేస్తున్నాయని అనిపించేది. నాడు వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కీలక మద్దతుదారుగా ఉంది. దీంతో చంద్రబాబు మాటకు బాగా విలువ ఉండేది. వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి నిధుల కోసం చంద్రబాబు నా రక్తం పీల్చేవారు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ చౌక రుణాలను కూడా చంద్రబాబు తరలించుకుపోయారు. రాష్ట్రం కోసం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించేవారు. పాలనా సామర్థ్యం, రాజకీయ చతురతతో చంద్రబాబు కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక లబ్ధి చేకూర్చారు.
100 శాతం గ్రాంట్‌గా మార్పు
2001లో ప్రపంచ బ్యాంకుతో 250 మిలియన్ డాలర్ల ఏపీ స్ట్రక్చరల్ అడ్జ్‌స్టమెంట్ లోన్(ఎ్‌సఏఎల్)పై చర్చలు జరిగాయి. అందులో... బ్రిటన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్(డీఎ్‌ఫఐడీ) నుంచి 100 మిలియన్ డాలర్ల గ్రాంట్ కూడా ఒక భాగం. సాధారణంగా రుణ, గ్రాంట్ నిష్పత్తి 70:30 ఉండగా ఏపీ ప్రభుత్వం డీఎ్‌ఫఐడీతో నేరుగా చర్చించి 100 శాతం గ్రాంట్‌గా మార్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రతిపాదనను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. నేను తిరస్కరించిన రెండు రోజులకే అదే ఫైలు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం పొందింది. ఏపీకి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పనికి ఆహార పథకంలో భారీ లబ్ధి
గతంలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పనికి ఆహార పథకాన్ని కూడా చంద్రబాబు పూర్తిస్థాయిలో వాడుకున్నారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 ఏప్రిల్ వరకు కేంద్రం ఈ పథకం కింద రాష్ట్రాలకు 40 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. అందులో ఏపీ ఒక్కటే 21.5 లక్షల టన్నులు అంటే.. 53 శాతం లబ్ధి పొందింది. ఆ తర్వాత మరో 10 లక్షల టన్నులు అదనంగా కూడా కేంద్రం నుంచి పొందింది. అప్పట్లో అన్ని రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 2.6 శాతం మాత్రమే పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటా 34 శాతం పెరిగింది. అంటే... చంద్రబాబు అప్పటి పరిస్థితులను రాష్ట్రం కోసం ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
నన్ను తప్పించాలని చూశారు
ఏపీకి నిధుల మళ్లింపులో నేను పదే పదే అడ్డుపడుతున్నాననే ఆలోచనతో నన్ను డీఈఏ డైరెక్టర్ స్థానం నుంచి తప్పించాలని కూడా చంద్రబాబు ప్రయత్నించారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీ వి.శ్రీనివాస్ నాకు ఈ విషయం చెప్పారు. అప్పటి ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి వీఎస్ సంపత్(తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా చేశారు) నన్ను ఆ స్థానం నుంచి తప్పించేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు శ్రీనివాస్ నాకు చెప్పారు.