CM Chandrababu: పూర్వోదయ నిధులివ్వండి
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:17 AM
వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రానికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వెనుకబడ్డ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఆ నిధులే కీలకం
నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వినతి.. కేంద్ర జలశక్తి మంత్రి
సీఆర్ పాటిల్‌తోనూ భేటీ.. పోలవరం పురోగతిని వివరించిన సీఎం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రానికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆయన కోరారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలను ఆమె కార్యాలయంలో చంద్రబాబు కలిసి, వినతిపత్రం ఇచ్చారు. ‘‘పూర్వోదయ పథకం కింద బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా కేంద్రం ఎంపిక చేసింది. ఈ పథకం నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాం. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంరఽధలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు; కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాం’’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకం నిధులను కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందన్నారు. దీనికోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని గురించి కేంద్రమంత్రికి ఆయన వివరించారు. కాగా, చంద్రబాబు పర్యటనలో ఆయన వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సానా సతీశ్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.