Chief Minister Chandrababu Naidu: జాతీయ ప్రయోజనాల కోసమేప్రాజెక్టులు కడుతున్నాం!
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:45 AM
జాతీయ ప్రయోజనాల కోసమే ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వాటికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు....
కేంద్రం సంపూర్ణంగా సహకరించాలి: సీఎం
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ
అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రయోజనాల కోసమే ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వాటికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆయనతో సీఎం సమావేశమయ్యారు. ఇందులో పోలవరం-నల్లమలసాగర్ పథకంపై ప్రధానంగా చర్చ జరిగింది. రూ.58 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించతలపెట్టామని.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఆమోదించాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రావసరాలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. నల్లమల సాగర్‌పై పాటిల్ స్పందిస్తూ.. దీనిపై తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొనగా.. సీఎం స్వరం పెంచినట్లు తెలిసింది. తెలంగాణ నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే సానుకూలంగా స్పందిస్తున్నారని.. అదే జోరును ఏపీ ప్రతిపాదనలపైనా చూపాలని అన్నారు. ధవళేశ్వరం నుంచి ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలసిపోతున్నాయని.. ఇలా వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవడానికే పోలవరం-నల్లమల సాగర్ పథకానికి రూపకల్పన చేశామని చంద్రబాబు వివరించారు. సముద్రంలో కలసిపోయే వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఏపీకి సంపూర్ణ హక్కులు ఉంటాయన్నారు. వరద జలాలతో ప్రాజెక్టు కట్టుకుంటే ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేమిటని నిలదీశారు. కృష్ణా ట్రైబ్యునల్-2 తరహాలో గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్-2ను కూడా వ్యవస్థీకరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నీటి వివాదాలు తగ్గుతాయని చెప్పారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు పాటిల్ సానుకూలంగా స్పందించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఏపీకి నీటి భద్రత అత్యంత కీలక అంశమన్నారు.
కర్ణాటక వేగంగా భూసేకరణ చేస్తోంది..
సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఉన్నప్పటికీ.. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 523.23 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు చర్యలు చేపడుతోందని, భూసేకరణ పనులు వేగవంతంగా చేస్తోందని, దానిని నిలువరించాలని పాటిల్‌ను చంద్రబాబు కోరారు. ఎత్తు పెంపును దిగువ, ఎగువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున కర్ణాటక వేగం పెంచకపోవచ్చని పాటిల్ అభిప్రాయపడ్డారు.
గరిష్ఠ స్థాయిలో పోలవరం..: పోలవరం ప్రాజెక్టును గరిష్ఠంగా 45.72 మీటర్ల కాంటూరు దాకా నిర్మించుకునేందుకు అనుమతులివ్వాలని, రెండో దశ అంచనాలను ఆమోదించాలని చంద్రబాబు కోరారు. కాలువల విస్తరణ పనుల అంచనా వ్యయం పెరిగిందని.. ఈ ఖర్చును కూడా ప్రాజెక్టు అంచనా వ్యయంలో కలపాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ-అటవీ శాఖ జారీచేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ గడువు వచ్చే ఏడాదితో ముగుస్తుందని గుర్తు చేశారు. పదే పదే స్టాప్‌వర్క్ ఆర్డర్ గడువు పెంచుకోవడం కంటే.. శాశ్వతంగా ఎత్తివేయడమే మంచిదన్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో ముడిపడిన అంశమైనందున స్టాప్ వర్క్ ఆర్డర్‌పై ఈసారి రెండేళ్లదాకా సడలింపు ఇస్తామని పాటిల్ హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. పుష్కర ప్రాజెక్టు, నేరడి బ్యారేజీపై సత్వరం నిర్ణయాలు తీసుకోవాలన్నారు.