CM Chandrababu: తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవు
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:19 AM
కక్ష పూరితంగా, ఆధారాలు లేకుండా, చట్ట నిబంధనలను పాటించకుండా పెట్టిన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన కేసులు కొట్టివేయడం సాధ్యం కాదు.
ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రానే కొట్టేయరు
జిల్లా కమిటీల జాప్యంపై చంద్రబాబు సీరియస్
13 లోగా పూర్తిచేయాలని పార్టీ నేతలకు ఆదేశం
ఇంటర్నెట్ డెస్క్: ‘‘కక్ష పూరితంగా, ఆధారాలు లేకుండా, చట్ట నిబంధనలను పాటించకుండా పెట్టిన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన కేసులు కొట్టివేయడం సాధ్యం కాదు.’’ అని పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై వైసీపీ హయాంలో పెట్టిన కేసులను న్యాయస్థానాలు కొట్టివేయడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటంపై చంద్రబాబు స్పందించారు. ‘‘వైసీపీ హయాంలో నాపై ఆధారాలు లేకుండా.. చట్టనిబంధనలను పాటించకుండా తప్పుడు కేసులు పెట్టారు. సీఎం హోదా వల్లే కేసులు కొట్టి వేస్తే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై ఉన్న కేసులనూ కొట్టి వేయించుకోవచ్చు కదా! జగన్ నెలకోసారి వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లిపోతారు. విజ్ఞత కోల్పోయి జగన్ చేస్తున్న విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు. అయితే జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.’’ అని చంద్రబాబు అన్నారు. కాగా, జిల్లా కమిటీల ఏర్పాటులో జాప్యంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. త్రీమెన్ కమిటీలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కమిటీ సభ్యుల ఎంపికను ఈ నెల 13వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఆర్‌ఎ్‌సఎస్ వంటి సంస్థలను స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ క్యాడర్‌ను సిద్ధాంతపరంగా బలంగా తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా క్యాడర్ శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. ఏ గ్రామంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి, వాటి ఆధారంగా పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీ జరపాలన్నారు. బోయ, వడ్డెర వంటి కులాలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత లేదని, అలాంటి కులాల నుంచి నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరు చాలా వరకు మెరుగుపడిందని, ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు.