Share News

CM Chandrababu Naidu: భూ సర్వేల్లో తప్పిదాలు దొర్లకూడదు

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:24 AM

భూ సర్వేల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సర్వే చేయించుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు....

CM Chandrababu Naidu: భూ సర్వేల్లో తప్పిదాలు దొర్లకూడదు

  • రెవెన్యూ సేవలు సులభంగా ప్రజలకు అందాలి

  • అన్ని ఆలయాల్లో తిరుమల తరహా సేవకులు

  • భూసారపరీక్షలు చేసి రైతులకు సమాచారం

  • ప్రజారోగ్యం బాగుపడేలా పంటలు పండించాలి

  • వ్యవసాయం-వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలి

  • ఆర్టీజీఎస్‌ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భూ సర్వేల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సర్వే చేయించుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూశాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించుకోవాలన్నారు. సోమవారం ఆర్టీజీఎస్‌ నుంచి వివిధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవదాయ సహా పలు శాఖల పనితీరును సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా ఉండాలని అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని దేవదాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయాల్లో సేవల కోసం స్థానికంగా వలంటీర్లను నియమించుకోవాలని, సేవలు చేసే వారిని గుర్తించి వారి జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. భగవంతుడి సేవకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలన్నారు. ఆసుపత్రులు పరిశుభ్రతతో ఉండాలని చెప్పారు. రోగులకు మంచి సేవలు అందించాలన్నారు. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు రెగ్యులర్‌ అంశాలపై ఫోకస్‌ పెడుతూనే కీలకమైన శాఖలు, విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లో క్షేత్రస్థాయి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.


ధాన్యం కొనుగోళ్లలో ఫిర్యాదులు రాకూడదు..

భూసార పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి వ్యవసాయ క్షేత్రాల్లోని మట్టిలో ఉన్న పోషక విలువలు ఏమోతాదులో ఉన్నాయి.. ఆ భూమి ఎంత సారవంతమైనది అనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గినా, లేదా కలుషితమైనా ఆ సమాచారాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. తక్కువ యూరియా వినియోగం వినియోగంతో ఎక్కువ పంటలు ఎలా పండించాలో రైతులకు వివరించాలన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుండటానికి ఎలాంటి పంటలు పండించాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉండే ఆర్‌ఎ్‌సకే-పీహెచ్‌సీలు కలిసి పనిచేయాలని చెప్పారు. ఈ విషయంలో వ్యవసాయ, వైద్యఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు పూర్తిస్థాయి ఫోకస్‌ పెట్టాలని సూచించారు. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే.. వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా శాఖ కూడా తన పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ పనితీరును ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 04:24 AM