Share News

AP to Set Up Agricultural Equipment Bank: సాగు పరికరాల బ్యాంక్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:13 AM

వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం వ్యవసాయ పరికరాల బ్యాంక్‌ (అగ్రికల్చర్‌ ఎక్వి్‌పమెంట్‌ బ్యాంక్‌)ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు...

AP to Set Up Agricultural Equipment Bank: సాగు పరికరాల బ్యాంక్‌

  • రైతుల కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయం

  • పరికరాల సమాచారానికి ఓ వెబ్‌సైట్‌

  • వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగు

  • పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి

  • పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ రాయాలి

  • పంట కొనుగోళ్లపై సమీక్షలో సీఎం దిశానిర్దేశం

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం వ్యవసాయ పరికరాల బ్యాంక్‌ (అగ్రికల్చర్‌ ఎక్వి్‌పమెంట్‌ బ్యాంక్‌)ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ధాన్యం, పత్తి, మిర్చి సహా వాణిజ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించి, వ్యవసాయ పరికరాల సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. 2025-26లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని, 7.39 కోట్ల గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని వివరించారు. స్పందించిన సీఎం.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూసుకోవాలని, ప్రజాప్రతినిధులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అండగా నిలబడాలని సూచించారు. పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, సజ్జల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చిరుధాన్యాల పంటలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

సీసీఐ తీరుపై సీఎం అసహనం

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి కొనుగోలుకు స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. ‘పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ రాయాలి. మిర్చి లాంటి పంటలకు మార్కెట్‌ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణ సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. 45,420 హెక్టార్లలో సాగైన సుబాబుల్‌ కర్రకి మార్కెట్‌కు అనుగుణంగా రైతులకు ధర దక్కేలా చూడాలి. పంట ఉత్పత్తులకు ధరలు పడిపోకుండా, కనీస మద్దతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్‌ ప్రక్రియలో రేషనలైజేషన్‌ విధానాన్ని పాటించాలి’ అని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 04:13 AM