Share News

AP CM Chandrababu: ప్రజల్లోకి వెళ్లండి మెరుగ్గా పౌర సేవలను అందించండి

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:59 AM

ప్రజల్లోకి వెళ్లి మెరుగైన సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సుపరిపాలనపై వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

AP CM Chandrababu: ప్రజల్లోకి వెళ్లండి మెరుగ్గా పౌర సేవలను అందించండి

  • సుపరిపాలనపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే నెల ప్రత్యేక వర్క్‌షాప్‌

  • వాతావరణం సహా 42 అంశాలతో అవేర్‌ యాప్‌

  • రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై చంద్రబాబు సమీక్ష

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లోకి వెళ్లి మెరుగైన సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సుపరిపాలనపై వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బందిలో పాలనాసామర్థ్యాలు పెరిగేలా, వారికి కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వాతావరణం సహా 42 అంశాలతో త్వరలోనే అవేర్‌ యాప్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలను మరింత మెరుగ్గా, సులభంగా, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజామోదం మేరకే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల ఆమోదం తీసుకున్నాకే పనులు పూర్తి చేయాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో కెపాసిటీ బిల్డింగ్‌ జరగాలని తెలిపారు. మొక్క జొన్న, పత్తి, అరటి పంటల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చూస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించిన పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతరం డేటా ఆధారంగా ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని, పౌర సేవలను అందించడంలో నిర్లక్ష్యం చూపేవారిపై కఠనంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాలపై నిరంతర సమాచారం అందించడం కోసం అవేర్‌ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ల్యాండ్‌ బ్రిడ్జి కనెక్టివిటీని పెంచాలని, సంక్షేమ హాస్టళ్లలోని తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రతపై పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, దీనిపైనా యాప్‌ను సృష్టించాలంటూ అధికారులకు సూచించారు. టీటీడీ తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలు, రద్దీ నిర్వహణ, భద్రత వంటి అంశాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా వర్తింపజేయాలన్నారు. వాయు కాలుష్యం తగ్గించేలా క్వాలిటీ సెన్సార్‌లను కాలుష్య నియంత్రణ మండలితో కలసి ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


  • పట్టణ కాలువలపై నేడు సీఎం సమీక్ష

జల వనరుల శాఖ చేపడుతున్న వరద నివారణ యాజమాన్య విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణాల్లోని కాలువల నిర్వహణపై సూచనలు చేయనున్నారు. వరద కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల అకస్మాత్తుగా భారీ వరదలతో పట్టణాలు ముంపునకు గురవుతున్నాయి. క్లౌడ్‌బర్‌స్టతో అనూహ్యంగా వర్షాలు కురుస్తుండటంతోనూ పట్టణాలు, నగరాలు వరదలో చిక్కుకుంటున్నాయి. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వీటని దృష్టిలో ఉంచుకుని వరద నీటి యాజమాన్య విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.

Updated Date - Nov 25 , 2025 | 06:00 AM