AP CM Chandrababu: ఉదారంగా ఆదుకోండి
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:56 AM
మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ఏపీని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు.
తక్షణ సాయంగా 2,622కోట్లు ఇవ్వండి
మొంథా తుఫాన్‌తో రూ.6,384కోట్ల నష్టం
కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ఏపీని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తక్షణ సాయంగా రూ.రూ.2,622కోట్లు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత... ఇలా మొత్తంగా రూ.6,384కోట్ల మేర పలు రంగాలకు నష్టం వాటిల్లిందని వివరించారు. రాష్ట్రంలో తుఫాన్ నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయింది. క్షేత్రస్థాయిలో రెండురోజులుగా జరిపిన పరిశీలనలను సీఎం దృష్టికి తీసుకువచ్చింది. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలు తుఫాన్ వల్ల ప్రభావితమయ్యాయి. దాదాపు 10లక్షల మంది తుఫాన్‌తోపాటు భారీ వర్షాల కారణంగా నష్టపోయారు. 9,960 ఇళ్లు నీట మునిగాయి. 1.11లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1.61లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దానివల్ల 3.27లక్షల మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతో పాటు ఆక్వా, పశుసంపద, చేనేత రంగానికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. 4,794కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 2,318 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. 22 జిల్లాల్లో 1.92లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాం. మొత్తం 3.36 లక్షల కుటుంబాలకు రూ.3వేలు చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాం. రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా రూ.2,622కోట్లు మంజూరు చేయండి’’ అంటూ జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు.
విభజన కష్టాలకు విధ్వంసం తోడు
తుఫాన్ నష్టంపై త్వరగా నివేదిక ఇచ్చి, రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రబృందాన్ని సీఎం కోరారు. ఏపీ నుంచి రెండు రోజుల్లో తుది అంచనాలు పంపుతామని ఆయన తెలపగా.. త్వరితగతిన కేంద్రానికి సిఫారసు చేస్తామని బృందం తెలిపింది. ఆర్టీజీఎస్ నుంచి ముందస్తు హెచ్చరికలు పంపి, సరైన సమయంలో విలువైన ప్రాణాలను కాపాడగలిగారంటూ చంద్రబాబును కొనియాడింది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సడలించేలా సిఫారసు చేయాలని సీఎం కోరారు. ఓ వైపు రాష్ట్ర విభజన, మరోవైపు గతపాలకుల విధ్వంసపాలన ఏపీని తీవ్రంగా నష్టపర్చాయని వివరించారు. నాడు రాష్ట్ర విపత్తు నిధులను కూడా దారి మళ్లించారని తెలిపారు. ‘తీర ప్రాంతాల్లోని సముద్ర కోత నివారణకు వేర్వేరు చోట్ల పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించేలా చూడండి. కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సముద్ర కోత నివారణ కోసం రూ.323కోట్లు, విశాఖ సమీపంలో రూ.203కోట్లు, శ్రీకాకుళం వద్ద రూ.98కోట్లు కేటాయించేలా సిఫారసు చేయండి’ అని కోరారు.
పంటంతా పోయింది.. ఆదుకోండి
కేంద్ర బృందానికి రైతుల వేడుకోలు
బాపట్ల, కోనసీమల్లో మొంథా నష్టాలను స్వయంగా పరిశీలించిన బృందం
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
మొంథా తుఫాన్‌తో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం మంగళవారం బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. ఎకరానికి 30 బస్తాల వరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసుకున్నాని, తుఫాన్ వల్ల 10 బస్తాలు కూడా చేతికివచ్చే పరిస్థితి కనిపించడం లేదని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రైతు మద్దుకూరి వెంకటసుబ్బారావు కేంద్రం బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మూడెకరాల్లో వరి సాగు చేశానని, రూ.50వేల వరకు నష్టం వచ్చేలా ఉందని మరో రైతు అనిల్ వాపోయారు. వాగులు పొంగిపొర్లడంతో కాలువ కింద సాగవుతున్న 150 ఎకరాల వరిని ముంపు ఊడ్చేసిందని రైతు బంగారు బాబు వివరించారు. కాగా, పంట నష్టాల అంచనాకు ఈ-క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తెలపగా, ఆ నమోదు వివరాలను తెలుసుకోవడానికి కేంద్ర బృందం ఆసక్తి కనబరిచింది.