CM Chandrababu: సాస్కీ కింద 5 వేల కోట్లివ్వండి
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:53 AM
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయ పథకం(సాస్కీ) కింద అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు...
ఆర్థిక మంత్రి నిర్మలకు చంద్రబాబు వినతి
‘పూర్వోదయ’ విధివిధానాలు రూపొందించండి
ఈ పథకాన్ని త్వరగా అమలు చేయండి: సీఎం
న్యూఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయ పథకం(సాస్కీ) కింద అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞపి చేశారు. శుక్రవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆమెతో ఆయన సమావేశమయ్యారు. ఓ వినతి పత్రం సమర్పించారు. సాస్కీ కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.2,010 కోట్లు అందాయని సీఎం తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని మంత్రిని కోరారు. అలాగే 2024-25కి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. తూర్పు ప్రాంత రాష్ర్టాల సమగ్రాభివృద్థి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నామని.. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దీని విధివిధానాలను రూపొందించి త్వరగా అమల్లోకి తేవాలని కోరారు.