Share News

CM Chandrababu: విపక్షాల అభ్యర్థికి మేమెలా మద్దతిస్తాం

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:57 AM

ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఇండీ కూటమి ఎలా ఆశిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గెలిచే అవకాశం లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని...

CM Chandrababu: విపక్షాల అభ్యర్థికి మేమెలా మద్దతిస్తాం

  • ఎన్నికల ముందు నుంచీ ఎన్డీఏలోనే ఉన్నాం

  • కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది మా ప్రభుత్వాలే

  • అలాంటప్పుడు మా మద్దతెలా ఆశిస్తారు?

  • ఓడిపోతామని తెలిసీ అభ్యర్థిని నిలబెట్టడం

  • అవసరమా?.. ఇది ‘ఇండీ’ రాజకీయం: సీఎం

  • ఇది ఇండీ కూటమి రాజకీయం: చంద్రబాబు

  • ఢిల్లీలో ఎన్డీఏ అభ్యర్థితో మర్యాదపూర్వక భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఇండీ కూటమి ఎలా ఆశిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గెలిచే అవకాశం లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ పదవి ప్రతిష్ఠను రాధాకృష్ణన్‌ పెంచుతారని.. ఆయన దేశంలోనే గౌరవనీయుడైన నాయకుడని.. ఆయనకే టీడీపీ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. ‘మేం ఎన్డీఏలో ఉన్నాం. వేరే అభ్యర్థికి మద్దతిస్తామని ఎలా ఆశిస్తారు? తెలుగుదేశం పార్టీ తెలుగు సమాజం కోసమే ఏర్పడింది. అది వేరే విషయం. లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే మేం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. అలాంటప్పుడు విపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఆశించడం, మాట్లాడడం సరికాదు. మా పార్టీకి నీతి, విశ్వసనీయత ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ విశ్వసనీయతను నిర్మించుకున్నాం. ఇప్పుడే కాదు.. ప్రారంభం నుంచీ నా వైఖరి మీకు తెలుసు. ఉపరాష్ట్రపతి చాలా గౌరవప్రదమైన పదవి. ప్రతిపక్షాలు ఇప్పుడు మరో అభ్యర్థిని ఎందుకు తెచ్చాయి? ఓడిపోతామని తెలిసీ అభ్యర్థిని నిలబెట్టడం అవసరమా? అది వారి రాజకీయం.

Untitled-3 copy.jpg


కానీ మేమిక్కడ రాజకీయాలు చేయడం లేదు. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. మాకు మెజారిటీ ఉంది.. సునాయాసంగా గెలవబోతున్నాం’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను తామంతా కలిసే నిర్ణయించామన్నారు. ఆయనతో ఎప్పటి నుంచో తనకు పరిచయం ఉందని.. ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలియజేశానని సీఎం చెప్పారు. ‘అభ్యర్థిత్వంపరంగా రాధాకృష్ణన్‌ ఉత్తమ అభ్యర్థి. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు. ఆయనకు అందరూ మద్దతివ్వాలి. రాధాకృష్ణన్‌ దేశానికి గౌరవం తీసుకొస్తారు. అలాంటి వ్యక్తికి మద్దతివ్వడం చాలా ఆనందం. సంతోషకరం’ అని తెలిపారు.

అప్పుడు పీవీ కోసం త్యాగం చేశాం..

తెలుగువారు అన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత మిగతా పార్టీలకు ఉంటుందని చంద్రబాబు అన్నారు. గతంలో ఒకసారి టీడీపీ, కాంగ్రెస్‌ పరస్పరం పోరాడుతున్న సమయంలో.. తెలుగువారు అనే ఉద్దేశంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కోసం నంద్యాల ఎంపీ సీటును త్యాగం చేసి, టీడీపీ మద్దతు పలికిందని తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 05:02 AM