Share News

CM Chandrababu: శాటిలైట్‌ డేటాతో సమస్తం

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:08 AM

శాటిలైట్‌ ద్వారా సేకరించిన డేటాను శాఖాధిపతులు, కార్యదర్శులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.....

CM Chandrababu: శాటిలైట్‌ డేటాతో సమస్తం

  • ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు...

  • అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయా..

  • అన్ని వివరాలూ తెలుసుకోవచ్చు..

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సేవలు

  • న్యాయ శాఖలో టెక్నాలజీ పెంచాలి

  • ప్రభుత్వంపై వ్యాజ్యాలు తగ్గించాలి: సీఎం

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): శాటిలైట్‌ ద్వారా సేకరించిన డేటాను శాఖాధిపతులు, కార్యదర్శులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం డేటా లేక్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌పై సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. తొలుత ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌ డేటా లేక్‌పై ప్రజెంటేషన్‌ ఇస్తూ.. శాటిలైట్‌ డేటా కూడా మన వద్ద అందుబాటులో ఉందన్నారు. ఏదైనా శాఖకు శాటిలైట్‌ చిత్రాలు కావాలంటే వెంటనే తమ వద్ద నుంచి తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? పొలాల్లో ఏ పంట వేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే సమాచారం కూడా శాటిలైట్‌ డేటా ద్వారా తెలుసుకోవచ్చునని సీఎం తెలిపారు. దీని ద్వారా భూసార పరీక్ష కూడా చేసే అవకాశం ఉంటుందని, ఇది గేమ్‌ చేంజర్‌ అని అన్నారు. అవసరాన్ని బట్టి హైరిజల్యూషన్‌లో డేటా అడుగుతామని, వెంటనే సిద్ధం చేసి ఇవ్వాలని కాటమనేనికి సూచించారు. రాష్ట్రంలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు తొలుత 8.5 శాతం, 9 శాతం, ఇప్పుడు 8.2 శాతానికి తగ్గాయని సీఎం అన్నారు. ప్రస్తుతం 820 సేవలు అందిస్తున్నామని, జనవరి 15 తర్వాత నుంచి 1200 సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఆర్టీజీఎ్‌సలో పీపీటీలు..

ఆర్టీజీఎ్‌సలో అన్ని రకాల డేటా ఉందని, ప్రస్తుతం 308 అంశాలకు సంబంధించిన డేటా ఉందని, మరింత స్టోర్‌ చేసుకునే అవకాశం ఉందని కాటమనేని చెప్పారు. రాష్ట్రంలోని గౌడౌన్లపై ఆర్టీజీఎస్‌ నుంచి ఒక పీపీటీ సిద్ధం చేయగా, ఇది బాగుందని సీఎం ప్రశంసించారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన డేటా ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం కాకపోవడంతో వెంటనే అనుసంధానం చేయాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంచామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. న్యాయ శాఖలో టెక్నాలజీ పెద్దగా ఉపయోగించడం లేదని, డేటా మొత్తాన్ని సేకరించాలని చంద్రబాబు సూచించారు. తద్వారా ప్రభుత్వంపై పడ్డ వ్యాజ్యాలు ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని కోర్టులకు సంబంధించి కేసుల వివరాలను సేకరించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Dec 11 , 2025 | 04:08 AM