CM Chandrababu: భారత్‌నెట్-2లో చేరండి
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:50 AM
గత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన ఏపీ ఫైబర్‌నెట్‌ను తిరిగి గాడిలో పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టును గత జగన్ ప్రభుత్వం...
ఫైబర్‌నెట్‌ను గాడిలో పెట్టండి
వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది రాజకీయ అవసరాలకు వాడుకుంది
లేని పోస్టులు సృష్టించారు
కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు
కనెక్షన్లు సగానికి తగ్గి ఖర్చు పెరిగింది
కనెక్షన్లు పెంచడంపై దృష్టి పెట్టండి
కేబుల్ ఆపరేటర్లకు సెట్‌టా్‌ప బాక్సులు ఇవ్వండి
ఏపీ ఫైబర్‌నెట్ సమీక్షలో సీఎం ఆదేశాలు
2019 నాటికి 8.7 లక్షల కనెక్షన్లు ఉన్నాయి
ప్రస్తుతం 4.5 లక్షలకు తగ్గిపోయాయి
ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన ఏపీ ఫైబర్‌నెట్‌ను తిరిగి గాడిలో పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టును గత జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యువతకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఫైబర్‌నెట్ లక్ష్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో 8.70 లక్షల కనెక్షన్‌లు ఉండగా..వైసీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆ సంఖ్య నాలుగున్నర లక్షలకు పడిపోయిందని, ఖర్చుపెరిగిపోయిందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఏపీ ఫైబర్‌నెట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. సంస్థ ముందున్న సవాళ్లు,ఆర్థిక సమస్యలు, ఫైబర్‌నెట్‌ను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో దృష్టిసారించారు. వేగవంతమైన ఇంటర్నెట్ సేవల అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్‌నెట్-2 ప్రోగ్రామ్‌లో చేరాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖను ఆదేశించారు. ఈ మేరకు కేంద్రానికి తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌కు సీఎం సూచించారు. భారత్‌నెట్-2లో చేరాక ఫైబర్‌నెట్ నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భారత్‌నెట్-1 ప్రోగ్రాం కూడా కొనసాగాలన్నారు. ఫైబర్‌నెట్‌పై ఆధారపడ్డ 6,000 మంది కేబుల్ టీవీ ఆపరేటర్లకు సెట్‌టాప్ బాక్సులను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
దొడ్డిదారిన వైసీపీ కార్యకర్తలకు కొలువులు
తమ హయాంలో కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపామని చంద్రబాబు చెప్పారు. 8 లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారిన ఆ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాల కోసం లేని పోస్టులు సృష్టించిందని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్‌కు 2025 నుంచి 2035 వరకూ రూ. 1,900 కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తాయని అధికారులు వివరించారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లోని 1,692 గ్రామ పంచాయతీల్లో ఫైబర్‌నెట్‌ను లీనియర్ నుంచి రింగ్ నెట్‌వర్క్‌కు మార్చేందుకు రూ. 430 కోట్లు ఇస్తుందని చెప్పారు. ఫైబర్‌నెట్ కనెక్షన్లు పెంచడంపై దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కనెక్షన్ల తగ్గుదలకు కారణాలనూ సీఎం విశ్లేషించారు. 2014-19 మధ్య కాలంలో ట్రిపుల్‌ప్లే(టీవీ, ఇంటర్నెట్, ఫోన్) సదుపాయంతో నెలకు రూ. 149కే సేవలు అందిచేవారమని, దానిని రూ. 350కు పెంచడంతో పాటు నాణ్యతలేకుండా చేశారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వర్చువల్ క్లాస్‌రూమ్‌లను పునరుద్ధరించాలని సూచించారు. రాష్ట్రంలోని 12,946 గ్రామ పంచాయతీలకు ఫైబర్‌నెట్ సేవలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. వ్యవసాయరంగంలో డ్రోన్ సేవలను అందించాలని సీఎం చెప్పారు. డ్రోన్ పోర్టల్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. సమీక్షలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
జగన్ పాలనలో ఫైబర్‌నెట్ కుదేలైంది ఇలా..
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఫైబర్‌నెట్‌ను ఏ విధంగా నిర్వీర్యం చేశారో సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. 2015లో 13 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఏపీ ఫైబర్‌నెట్ తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేనాటికి 38,000 కిలోమీటర్ల మేర విస్తరించిందన్నారు. కనెక్షన్ల సంఖ్య 8,70,438కి చేరిందని,కేవలం 130 మంది సిబ్బందితో సేవలు అందించామని చెప్పారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత ఫైబర్‌నెట్ విస్తరణ వైపు దృష్టి సారించలేదన్నారు. 2021-22లో కనెక్షన్లు 7,51402కు తగ్గాయని తెలిపారు.కానీ ప్రభుత్వ,అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది మాత్రం 127 నుంచి అమాంతం 918కు పెరిగిపోయారని పేర్కొన్నారు.2022-23 నాటికి సిబ్బంది 937కు చేరుకున్నారని, కనెక్షన్లు 7,29,654కు తగ్గిపోయాయని వెల్లడించారు. 2023-24 నాటికి ఉద్యోగుల సంఖ్య 1,350 మందికి చేరుకుంటే, కనెక్షన్లు 5,45,235కు తగ్గాయన్నారు.2024-25 నాటికి కనెక్షన్లు 5,06,422, ప్రస్తుతం 4,53,525కు పడిపోయాయని తెలిపారు. ఇక జగన్ హయాంలో ఫైబర్‌నెట్‌లో వ్యయాలు ఒక్కోఏడాది పెరుగుతూ వచ్చాయని చెప్పారు. జగన్ ప్రభుత్వం దిగిపోయాక ఖర్చులు రూ. 350 కోట్లకు, ఉద్యోగుల సంఖ్య 442కు పడిపోయిందన్నారు.ఇప్పటికే ఫైబర్‌నెట్ అక్రమాలపై మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదనరెడ్డిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.