AP CM Chandrababu Naidu: 3 ప్రాంతాల్లోనూ డీ-ఎడిక్షన్ కేంద్రాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:42 AM
గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు డీ-ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి, తిరుపతి, విశాఖల్లో పెట్టాలి: సీఎం
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి):గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు డీ-ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీటిని అమరావతి, తిరుపతి, విశాఖలో నెలకొల్పాలన్నారు. ప్రజల కోణంలో ఆలోచిస్తూ సేవలందించాలని అధికారులకు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష జరిపారు. ‘ప్రజలకు సంతృప్తికంగా సేవలందించాలి. ప్రభుత్వపథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించాలి. గంజాయి కట్టడికి పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలి. ఇందుకోసం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో నేనూ పాల్గొంటా’ అని సీఎం వెల్లడించారు. తరచూ తాగునీటి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో ఫిర్యాదులు రాకూడదని అధికారులను హెచ్చరించారు. కలుషితమైందన్న సమాచారం వచ్చిన వెంటనే అప్రమత్తమవ్వాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయాలకు రావలసిందేనని తేల్చిచెప్పారు. ఫైళ్ల పర్యవేక్షణ, సిబ్బంది హాజరు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎ్‌సకు తెలియజేయాలన్నారు.