CM Chandrababu Order: రోడ్లపై గుంతలు ఉండకూడదు
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:13 AM
వర్షాకాలంలో కూడా రోడ్లపై గుంతలు ఉండకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఒక వేళ గుంతలు పడితే..
గ్రామీణ రహదారులకు కనెక్టివిటీ పెంచాలి
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం
డిసెంబరు కల్లా గుంతల రహిత రోడ్లు: కృష్ణబాబు
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో కూడా రోడ్లపై గుంతలు ఉండకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఒక వేళ గుంతలు పడితే.. అదే రోజు పూడ్చాలని ఆదేశించారు. రహదారుల పరిస్థితిపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల పసులు ఏవీ ఆగకూడదని ఆర్‌అండ్‌బీ అధికారులకు స్పష్టం చేశారు. గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారులకు, అర్బన్ రోడ్లకు, జిల్లా రోడ్లకు కనెక్టివిటీ పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు.. ఈ ఏడాది డిసెంబరుకల్లా రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీనిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే రూ.860 కోట్ల వ్యయంతో 19,000 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చాం. మరో 5,946 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చడానికి రూ.500 కోట్లు మంజూరు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 4,223 కి.మీ. మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేయడానికి రూ.2వేల కోట్లు అవసరం’ అని వివరించారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఎకోఫిక్స్ విధానం ఉపయోగిస్తున్నామని, దీంతో గుంతలు పూడ్చితే వర్షాలకు కొట్టుకుపోకుండా ఉంటాయన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి ఎక్కడెక్కడ భూసేకరణ సమస్యలున్నాయో.. వాటిపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు.
గిరిజన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ: శశిభూషణ్‌కుమార్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు కనెక్టివిటీ లేక ఇబ్బందిపడుతున్న గిరిజన ప్రాంతాలకు ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 63.60 లక్షల మందికి పని కల్పించామని, ఈ పథకానికి రూ.6,057.84 కోట్లు వెచ్చించామన్నారు. రాష్ట్రంలో 22,514 పశుసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఏడాదిలోగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి: కృష్ణబాబు
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ఏడాదిలోగా పూర్తిచేస్తామని మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. అలాగే జువ్వలదిన్నె, నిజాపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు పనులు 71.90 శాతం పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది మే నాటికి మూలపేట పోర్టు, డిసెంబరు నాటికి మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇక ఈనెల 25 నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు 98 శాతం పూర్తవుతుందన్నారు. నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లను ఏడాది మార్చి నాటికి, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికే తలమానికంగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతున్నామని కృష్ణబాబు వెల్లడించారు. ఇప్పటికే 86.06 శాతం మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్‌పోర్టులను విస్తరిస్తున్నామని చెప్పారు. కుప్పం, దగదర్తి, పలాస విమానాశ్రయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.