Share News

CBI Investigation: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి సీఎం చంద్రబాబు నిర్ణయం

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:28 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతికి న్యాయం జరగాలని...

 CBI Investigation: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి సీఎం చంద్రబాబు నిర్ణయం

  • సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

  • 2017లో ప్రీతి అనుమానాస్పద మృతి

  • న్యాయం చేయాలని జనసేనాని పోరాటం

  • వైసీపీ హయాంలో కేసు సీబీఐకి అప్పగింత

  • అయినా ముందుకు సాగని దర్యాప్తు

  • డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్‌ చేస్తూ రోడ్డెక్కిన మృతురాలి తల్లి పార్వతీదేవి

  • వైసీపీ నేతల ప్రోద్బలంతో ఆరోపణలు

  • మరోసారి సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం

కర్నూలు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీతికి న్యాయం జరగాలని గత వైసీపీ ప్రభుత్వంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రోడ్డెక్కి పోరాటం చేశారు. దీంతో జగన్‌ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. అయినా దర్యాప్తు ముందుకు సాగలేదు. తాజాగా మరోసారి సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసు వివరాలు... కర్నూలు నగరానికి చెందిన సుగాలి ప్రీతి స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతూ అదే పాఠశాల హాస్టల్‌లో ఉండేది. 2017 ఆగస్టు 19న హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం ప్రీతిది ఆత్యహత్యగా పేర్కొంది. విద్యార్థిని తల్లి పార్వతీదేవి, కుటుంబ సభ్యులు మాత్రం పాఠశాల యాజమాన్యానికి చెందిన తండ్రి, ఆయన ఇద్దరు కుమారులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన నెల రోజులకు నిందితుల్లో ఇద్దరిని (పాఠశాల అధినేత కుమారులు) అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత పాఠశాల యాజమాని పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. తరువాత ఈ ముగ్గురూ బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో ప్రీతికి న్యాయం జరగలేదని, పోలీసులు కేసును నీరుగార్చారని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి తల్లి, కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు.


పవన్‌ పోరాటంతో కదలిక

సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2019లో ప్రీతి తల్లి పార్వతీదేవి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని కోరారు. ఈ కేసులో దర్యాప్తు త్వరితగతిన జరపాలని, మృతురాలు ప్రీతికి న్యాయం చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వంపై జనసేనని ఒత్తిడి తెచ్చారు. ఇంతలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రీతికి న్యాయం చేయాలంటూ వివిధ వేదికల్లో పవన్‌ గళం ఎత్తారు. కర్నూలుకు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వం జీవో జారీ చేసి 8 నెలలు గడిచినా సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టలేదని ప్రీతి తల్లిదండ్రులు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అప్పగించిన పలు కేసుల దర్యాప్తులో బిజీగా ఉన్నామని, ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తమవద్ద తగినన్ని వనరులు లేవని కోర్టుకు సీబీఐ చెప్పినట్లు సమాచారం. ప్రీతికి న్యాయం చేయాలని, విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటూ పవన్‌ చేసిన పోరాటాలతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థిని కుటుంబానికి దిన్నెదేవరపాడు దగ్గర 5 ఎకరాల పొలం, కర్నూలు నగరంలో 5 సెంట్లు ఇంటి స్థలం, తండ్రి రాజు నాయక్‌కు ఉద్యోగం ఇచ్చారని జనసేన నాయకులు చెబుతున్నారు.


మళ్లీ సీబీఐ దర్యాప్తునకు నిర్ణయం

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... ప్రీతి కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఐడీ అధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. ఇదే సమయంలో న్యాయం చేయాలని కోరుతూ ప్రీతి తల్లి పార్వతీదేవి ఆగస్టు 19న కర్నూలు టు అమరావతి వీల్‌చైర్‌ యాత్ర చేట్టారు. అయితే.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు.. కొండారెడ్డి బురుజు వరకు అనుమతి ఇచ్చారు. దీంతో యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంపై నిందలు వేసేలా ప్రీతి తల్లి మాట్లాడటం వెనుక వైసీపీ నాయకులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు సోమవారం కర్నూలులో ప్రీతి తల్లి పార్వతీదేవిని కలిసి పరామర్శించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అయితే.. గిరిజన విద్యార్థినికి న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 03:30 AM