Share News

Chandrababu Naidu: రైతులు నష్టపోకూడదు

ABN , Publish Date - May 17 , 2025 | 04:29 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లు ఆపకుండా తక్షణమే చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోగాకు, కోకో, మిర్చి పంటల్లో దళారుల దోపిడీని నిరోధించి, నిజమైన రైతులను ఆదుకోవాలన్నారు.

Chandrababu Naidu: రైతులు నష్టపోకూడదు

పంటలకు గిట్టుబాటు ధర రావాలి

బర్లీ పొగాకు క్వింటా 12,500కు, కోకో కిలో 500కు కొనాలి

రైతు దగ్గరున్న ధాన్యమంతా కొనుగోలు

అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా, రేటు తగ్గకుండా, గిట్టుబాటు ధరకు వ్యాపారులు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోకో రైతులను దోపిడీ చేయకుండా కిలో రూ.500కు కొనుగోలు చేసేలా చూడాలని, రైతుల దగ్గరున్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, మార్కెట్‌ యార్డుల్లో తక్కువ ధరకు మిర్చిని అమ్మిన నిజమైన రైతుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో పొగాకు, కోకో, మిర్చి ధరలు, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, వ్యాపారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘పొగాకు ధర పతనం కావడం సరికాదు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. పొగాకు కొనుగోళ్లు ఆపకుండా, రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం వెంటనే కొనుగోలు చేయాలి. రైతులు, ట్రేడర్లతో స్నేహపూరితంగా ఉంటాం. అలాగని రైతులకు అన్యాయం జరిగితే సహించం. ట్రేడర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టులో పెట్టుకుని, ప్రస్తుతం పొగాకు కొనుగోళ్లపై తలెత్తిన సంక్షోభాన్ని నివారించకపోతే చర్యలు తీసుకోవటానికీ వెనుకాడేది లేదు’ అని స్పష్టం చేశారు. పొగాకు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైందని, జీపీఐ, ఐటీసీ వంటి సంస్థలతో సరైన సమన్వయం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. అత్యధిక ధర ఆశ చూపి, రైతులు పొగాకు సాగు చేసేలా చేస్తున్న కంపెనీలు, పంట చేతికొచ్చాక కనీస మద్దతు ధర కూడా కల్పించకుండా ధరలు తగ్గించి, సంక్షోభాన్ని సృష్టించడం సరికాదన్నారు.


‘హెచ్‌డీ బర్లీ పొగాకును నాణ్యత మేరకు క్వింటా రూ.12,500కు కంపెనీలు కొనాలి. జీపీఐ, ఐటీసీ తక్షణమే 20 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలును ప్రారంభించాలి. ఎంత ధరకు, ఏమేరకు కొనుగోళ్లు సాగుతున్నాయో ఈ నెల 12న నివేదిక ఇవ్వాలి. కంట్రోల్‌ రూమ్‌, వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లను పర్యవేక్షించి, రెండురోజులకోసారి అధికారులు నివేదిక ఇవ్వాలి. ప్రస్తుత సమస్యను అధిగమించేందుకు బై బ్యాక్‌ పాలసీ ఉండాలి. రైతులు ఇక నుంచి కంపెనీలతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకోవాలి’ అని సీఎం అన్నారు. డిమాండ్‌-సప్లై ప్రకారం ధర నిర్ణయించి, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే, రైతులు పూర్తిగా పొగాకు సాగు మానేసే పరిస్థితి వస్తే.. కంపెనీలన్నీ మూతపడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తి, ప్రొసెసింగ్‌, ఎగుమతులను నియంత్రిస్తోందని, వైట్‌ బర్లీని 90ు కంపెనీలు కొనుగోలు చేశాయని, మిగిలిన హెచ్‌డీ బర్లీని కంపెనీలతో ఒప్పందం లేకుండా సాగు చేస్తున్నారని పొగాకు బోర్డు అధికారులు చెప్పారు. ఇప్పటికే 15మిలియన్‌ కిలోలు కొనుగోలు చేయగా, మిగతా ఉత్పత్తికి ఎగుమతి ఆర్డర్ల కోసం చూస్తున్నామని తెలిపారు. అయితే ఎఫ్‌సీవీ, వైట్‌ బర్లీ, హెచ్‌డీ బర్లీ 2024-25లో 1.90.456 హెక్టార్లలో సాగైతే, 450 మిలియన్‌ కిలోల దిగుబడి వచ్చిందని, ఇతర పంటల నుంచి రైతులు పొగాకు సాగువైపు మొగ్గు చూపడంతో ఉత్పత్తి రెట్టింపైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. వచ్చే సీజన్‌లో అంతర్జాతీయ డిమాండ్‌, ధరల ఆధారంగా హెచ్‌డీ బర్లీ పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించేలా రైతులకు జూన్‌ నుంచి అవగాహన కల్పించాలని సూచించారు. కోకో పంటకూ గిట్టుబాటు ధర ఉండాలని, కిలో రూ.500కు తగ్గకుండా కోకో గింజలు కొనాలని కొనుగోలు సంస్థకు సీఎం సూచించారు. కోకో కొనుగోలులో రైతులను దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు.


తక్కువ ధరకు అమ్మిన మిర్చి రైతుల జాబితా సిద్ధం చేయండి..

మార్కెట్‌ యార్డుల్లో మిర్చిని అమ్మిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం మార్కెటింగ్‌శాఖను ఆదేశించారు. జాబితాలో దళారులను తొలగించి, నిజమైన రైతులు ఎంతమేరకు నష్టపోయారో గుర్తించి, వారిని మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, సన్నరకాల ధాన్యం పండించేలా రైతుల్ని ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - May 17 , 2025 | 04:29 AM