CM Chandrababu Naidu: బాధ్యత ఉండొద్దా
ABN , Publish Date - Aug 18 , 2025 | 03:36 AM
కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా?
కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్
ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటాం
పదవుల్లో ఉన్నారు.. అప్రమత్తంగా ఉండాలి
ఆమదాలవలస, గుంటూరు తూర్పు,అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి
రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం
ఫ్రీ బస్సులపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
పథకాలపై ప్రజలతో మమేకం కావాలి
అప్పుడే ప్రభుత్వానికి మంచిపేరు: సీఎం
టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని నిలదీశారు. ఇలాంటి విషయాల్లో ఇక కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. బాధ్యతగల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు టీడీపీ శ్రేణులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలు, ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేజీవీబీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలనూ తప్పుబట్టారు. ఈ ముగ్గురి కారణంగా వచ్చిన విమర్శలు, తలెత్తిన వివాదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారశైలి చిన్న విమర్శకు కూడా ఆస్కారం ఇచ్చేలా ఉండకూడదని పదే పదే చెబుతున్నా తీరు మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఆయా వ్యవహారాల్లో తమ తప్పులేకుంటే.. తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు గానీ, పార్టీ నేతలు గానీ వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని స్పష్టంచేశారు.
పథకాల అమల్లో భాగస్వాములు కావాలి
సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజాస్పందనపై పార్టీ వర్గాలతో చంద్రబాబు సమీక్షించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాల ఎంత వరకు విజయవంతం అయ్యాయో అడిగి తెలుసుకున్నారు. స్త్రీశక్తి పేరుతో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంపై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోందని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్‌తో వైసీపీ అంతర్మథనంలో పడిందని, దీంతో తప్పుడు ప్రచారాలకు దిగుతోందని తెలిపారు. ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారిని సీఎం ఆదేశించారు. పథకాల అమల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములయ్యేలా చూడాలని నిర్దేశించారు. ప్రజలతో మమేకమైతేనే పథకాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు.