CM Chandrababu: జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తా
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:33 AM
రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మికంగా పర్యటిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుంటా
ఉగాది రోజున ఐదు లక్షల గృహ ప్రవేశాలు: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 17 ( ఆంధ్రజ్యోతి ) : రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మికంగా పర్యటిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వంపై ప్రజల స్పందనను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటనలు ఉంటాయని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇ-గవర్నెన్స్, డేటాలేక్, ఆర్‌టీజీఎస్ అంశాలపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. అర్హులైన వారందరికీ గృహాలను అందించమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉగాది నాడు ఐదు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇళ్లు కట్టి ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపును శ్రీకాళహస్తిలో చేయడంవల్ల తిరుపతికి చెందిన లబ్ధిదారులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని కలెక్టరు తెలపగా, వీలైనంతవరకూ లబ్ధిదారులకు సమీపంలోనే భూమిని సేకరించాలని సీఎం ఆదేశించారు. ఒకవేళ భూమి దొరకపోతే, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి వెళదామని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగాన్ని పెంచాలన్నారు.