Share News

CM Chandrababu Naidu: శాంతి భద్రతల పరిరక్షణలో.. పోలీస్‌కు సెల్యూట్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:44 AM

ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

CM Chandrababu Naidu: శాంతి భద్రతల పరిరక్షణలో.. పోలీస్‌కు సెల్యూట్‌

  • 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి 6,014 ఉద్యోగాలిచ్చాం

  • రాష్ట్రంలోని మొత్తం 55 వేల కానిస్టేబుళ్లలో 24 వేలమందిని నేనే నియమించా..

  • డీఎస్సీతో 15,591 మందికి కొలువులిచ్చాం

  • కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

  • 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీకి కట్టుబడ్డాం

  • ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నాం

  • సైబర్‌ క్రైమ్‌, ఆర్థిక నేరాలు, డ్రగ్‌ మాఫియాపై క్రియాశీలకంగా పని చేయాలి: చంద్రబాబు

  • కొత్త కానిస్టేబుళ్లకు నియామకపత్రాల జారీ

త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. బయటకెళ్లిన వారు సురక్షితంగా తిరిగొస్తున్నారంటే అందుకు పోలీసు వ్యవస్థే కారణం. ఒకప్పుడు రాయలసీమలో ముఠా కక్షలు, గొడవలు ఉండేవి. హైదరాబాద్‌లో మత విద్వేషాలు ఉండేవి. గబ్బర్‌సింగ్‌ లాంటి ఒక పోలీసు అధికారితో వాటిని నియంత్రించాను. తీవ్రవాద సమస్యతోపాటు ప్రజలకు నష్టం కలిగించే ఏ వ్యవస్థనూ నేను ఉపేక్షించలేదు. అందుకే నామీద 24 క్లైమోర్‌ మైన్స్‌తో దాడి చేశారు. అయినా భయపడలేదు.

- సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త కానిస్టేబుళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలను కాపాడాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘మీకు ఉద్యోగాలివ్వకుండా రాజకీయ ప్రత్యర్థులు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 31 కేసులేశారు. అయినప్పటికీ రికార్డు సమయంలో పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లో ఫలితాలు వెల్లడించి, ఎక్కడా రూపాయి లంచానికి తావు లేకుండా, సిఫారసులు లేకుండా 6,014 కానిస్టేబుల్‌ ఉద్యోగాలిచ్చాం. 3,343 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు. 2,414 ఏపీఎ్‌సఈపీ, 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆర్టీసీలో 33 శాతం కండక్టర్లు మహిళలే ఉండాలనుకున్నాను. అది జరిగింది. ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మహిళలు ఉండాలని కోరుకున్నా. అది నెరవేరలేదు. డ్రైవర్లుగా కూడా వస్తారని ఆశిస్తున్నా. 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 1999 - 2004 లో 8,109 మందికి పోలీసు ఉద్యోగాలిచ్చా. 2014-19లో 9,464 మందికి, ఇప్పుడు 6,014 మందికి ఉద్యోగాలిచ్చాం. ఇలా మొత్తం 23,676 ఉద్యోగాలిచ్చాం. రాష్ట్రంలో 55,000 మంది కానిస్టేబుళ్లు ఉంటే, 24వేలమందికి నేనే ఉద్యోగాలిచ్చాను.’’అని చంద్రబాబు తెలిపారు. హోం మంత్రి అనిత, డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అభినందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


20 లక్షల ఉద్యోగాలు కచ్చితంగా ఇస్తాం

‘‘కూటమి మ్యానిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మెగా డీఎస్సీ ద్వారా 15,591 మందికి ఉద్యోగాలిచ్చాం. అన్ని శాఖల్లో 4,51,347 మందికి ఇప్పటికే ఇచ్చాం. ఇవి కాకుండా 197 పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు...రూ. 8,55,170 కోట్ల పెట్టుబడులు... ఇవన్నీ పూర్తయితే కొత్తగా 8,23,922 మందికి ఉద్యోగాలొస్తాయి. విశాఖ భాగస్వామ్య సదస్సులో 538 ఎంవోయూలు చేశాం. 11 లక్షల 38,000 కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం. వాటి ద్వారా 11 లక్షల 37,000 మందికి ఉద్యోగాలొస్తాయి. 735 పరిశ్రమలు వస్తాయి.’’


గంజాయిని నియంత్రిస్తున్నాం

‘‘రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌ వల్ల చెడ్డ పేరొస్తోంది. పిల్లల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారు. ఏజెన్సీలో గంజాయి లేకుండా నివారిస్తున్నాం. ఎవరైనా రౌడీయిజం చేసేవారికి ఈ రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. ఒకప్పుడు రౌడీలను రాష్ట్రం నుంచి బయటకు పంపేశాం. ఇప్పటికీ అదే నా పంథా. నేర స్వభావం ఉన్న వ్యక్తులపై కన్నేయాలి. నేరాలు జరిగిన వెంటనే వేగంగా స్పందించాలి. పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిని ప్రభుత్వానికి అంటగట్టాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయి. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆయన తాగి తూలుతూ, పడుతూ లేస్తూ రాజమండ్రి కెళ్లేముందు ప్రమాదవశాత్తూ చనిపోయారని పోలీసులు గుర్తించారు. గతంలో రాజకీయాల్లో నేరస్థులు ఉండేవారు కాదు. నేరస్థులకు మద్దతిచ్చేవారు కూడా కాదు. ఇప్పుడు రాజకీయ నేరస్థులకు అండదండలు దొరుకుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా గత ఐదేళ్లలో లేడీ డాన్లు కూడా తయారయ్యారు. మహిళల్లో రౌడీలు ఉంటారని ఊహించలేదు. వారు ఏకంగా చంపేస్తున్నారు. పెద్దపెద్ద నాయకులను వాడుకుంటున్నారు. నేరాలు అరికట్టడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఎంటెక్‌ చేసి కానిస్టేబుల్‌తో సరిపెట్టుకోవాలని అనుకోవద్దు. కష్టపడండి.ప్రతిభకు సాన బెట్టుకోండి.’’

నా ఓటమికి ఇది కూడా కారణమే..

‘‘రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యాయి. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వంటి ఘటనలు నాలాంటి వ్యక్తులకు కొన్ని గుణపాఠాలు నేర్పించాయి. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆ అనుభవంతో గ్రహించాను. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య జరిగింది. ముందు గుండెపోటు అంటే... నేను నమ్మాను. కానీ ఆయనది హత్య. ఒక సీఐ దగ్గరుండి ఆయన గదిలోని రక్తం కడిగించారు. ముఖ్యమంత్రిపైనే ఆ నేరాన్ని నెట్టేశారు. నా చేతిలో కత్తి పెట్టి ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాశారు. అప్పుడే విషయం పసిగట్టి నిందితుల్ని పట్టుకుని ఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు. ఇప్పుడు నన్ను ఇక ఎవరూ మభ్యపెట్టలేరు.’’

Updated Date - Dec 17 , 2025 | 06:11 AM