CM Chandrababu Naidu: ఉమ్మీద్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు గడువు పెంచండి
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:18 AM
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ‘ఉమ్మీద్’ పోర్టల్‌లో నమోదు చేసే గడువును 12 నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు...
కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు చంద్రబాబు లేఖ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఫరూక్, అజీజ్, షరీఫ్
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ‘ఉమ్మీద్’ పోర్టల్‌లో నమోదు చేసే గడువును 12 నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. ఈ విషయాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి గడువు డిసెంబరు 5తో ముగియనుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 4,748 రిజిస్టర్డ్, పదివేల దాకా అన్ రిజిస్టర్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 3,100 ఆస్తుల వివరాలను విజయవంతంగా అప్‌లోడ్ చేసినప్పటికీ, సాంకేతిక సమస్యలు, స్టేక్ హోల్డర్ల సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని మరో ఏడాదిపాటు గడువు పెంపు కోసం లేఖ రాసిన సీఎంకు మంత్రి ఫరూక్‌తోపాటు, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.