Share News

CM Chandrababu Naidu: అరటి రైతులు నష్టపోకుండా చర్యలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:30 AM

రాయలసీమలో రైతులు పండించిన అరటిని ముంబై, కోల్‌కత్తా వంటి పెద్ద మార్కెట్లకు తరలించి, విక్రయించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Naidu: అరటి రైతులు నష్టపోకుండా చర్యలు

  • రైల్వే వ్యాగన్లలో రవాణాకు ప్రణాళికలు

  • ముంబై, కోల్‌కతా మార్కెట్లలో విక్రయం

  • మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు

  • తడిసిన పత్తినీ కొనుగోలు చేయాలి: సీఎం

  • పుట్టపర్తి నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో రైతులు పండించిన అరటిని ముంబై, కోల్‌కత్తా వంటి పెద్ద మార్కెట్లకు తరలించి, విక్రయించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం పుట్టపర్తి నుంచి ఆయన.. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అరటి ధరలు, కొనుగోళ్లపై ప్రతి రోజూ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలి. మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు అరటి లోడుతో కూడిన రైల్వే వ్యాగన్లను పంపేందుకు చర్యలు తీసుకోవాలి. రాయలసీమలో 40వేల హెక్టార్లలో అరటి ఉత్పత్తి అవుతోంది. డిసెంబరులో మొదటి వారం నుంచి అరటి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. సీమలో పండిన అరటిని రవాణా చేసేందుకు ఓ ఏజెన్సీ ముందుకు వచ్చింది. అప్పటి వరకూ అరటి రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు అరటిని రవాణా చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి’ అని ఆదేశించారు. అలాగే, మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. మొక్కజొన్నకు మద్దతు ధర కంటే తక్కువ రేటు పలుతున్నందున వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సారి 1.42లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని, 8.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలపగా, 2.04 లక్షల టన్నుల మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మకంగా వాటి ద్వారా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈ విధానం సత్ఫలితాలిస్తే.. సమస్య ఎదురైనప్పుడు ఇదే విధానాన్ని అనుసరించవచ్చని చెప్పారు.


పత్తి కొనుగోళ్లలో వేగం పెంచాలి

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రంగుమారిన, తడిసిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రతి రోజూ తనిఖీ చేసి, ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి, సమస్యల్ని పరిష్కరించాలని నిర్దేశించారు. స్లాట్‌ బుకింగ్‌ సమస్యను సీసీఐ పరిష్కరించిందని అధికారులు వివరించగా, సమీపంలోని జిన్నింగ్‌ మిల్లులకే పత్తిని రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తేమ శాతం వంటి నిబంధనల కారణంగా పత్తి రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు.


‘ఫ్రూట్‌ కేర్‌’తో అరటికి మంచి ధర

ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): అరటికి స్థానిక మార్కెట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ మంచి ధర పలకడానికి ‘ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీస్‌’ చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్‌ కె. శ్రీనివాసులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అరటి మార్కెట్‌పై శనివారం ఆయన రాష్ట్ర స్థాయిలో ఎస్‌కే బనాన, ఐఎన్‌ఐ, నోవా, సండ్రియా, వేగ్రో, బంధన్‌ కంపెనీలలతో సమావేశం నిర్వహించారు. అరటిలో నాణ్యత ఉంటే కిలో రూ.7.50-8 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. నాణ్యత లేని అరటి పండ్లను స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు తీసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే నెల 15తర్వాత ధర పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై డైరెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అరటి రైతూ ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీ అవలంబిస్తే.. నాణ్యత పెరిగి, మార్కెట్‌లో మంచి ధర వస్తుందని చెప్పారు. దూర ప్రాంతాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. మంచి రకాల అరటిసాగును ప్రోత్సహించడంతో పాటు, ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీపై రైతుసేవా కేంద్రాల సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 04:32 AM