Share News

CM Chandrababu Naidu: వడ్డెర్లకు మైనింగ్‌ లీజులు

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:18 AM

రాష్ట్రంలో వడ్డెర్లకు మైనింగ్‌ లీజులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను వెంటనే రూపొందించాలని గనుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

 CM Chandrababu Naidu: వడ్డెర్లకు మైనింగ్‌ లీజులు

  • అవసరమైన విధివిధానాలు రూపొందించండి.. వచ్చే క్యాబినెట్‌కు ప్రతిపాదనలు అందించాలి

  • గనుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

  • మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు చర్యలు

  • ఉచిత ఇసుకపై ముఖ్యమంత్రి ఆరా

  • గత అక్రమాలపై మరోసారి శాస్త్రీయ పరిశీలన

  • శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా తవ్వకాల అంచనా

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వడ్డెర్లకు మైనింగ్‌ లీజులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను వెంటనే రూపొందించాలని గనుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే మంత్రి వర్గ సమావేశానికి ఈ ప్రతిపాదనలు అందించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా, ఇన్‌చార్జి కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్టీజీఎస్‌ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వడ్డెర్లకు రోడ్‌మెటల్‌, ఇతర గనుల లీజులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లోగడనే ప్రభుత్వం గనుల శాఖను ఆదేశించింది. ఈ దిశగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సవరణలు సూచించినట్లు తెలిసింది. వడ్డెర్లు, వారి నేతృత్వంలోని సొసైటీలకు 15 శాతం మేర గనుల లీజులు కేటాయించేలా విధానం రూపొందించాలని సీఎం ఆదేశించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వడ్డెర్లకు ఆర్థిక ప్రయోజ నాలు దక్కేలా లీజు విధానం రూపొందించాలని సూచించారు. లీజు సీన రేజీ, ప్రీమియం మొత్తంలో 50 శాతం రాయుతీ ఇవ్వాలని శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఖనిజాల విలువ అంచనా వేయండి

రాష్ట్రంలో భారీ, మధ్య, సూక్ష్మ ఖనిజాల విలువను అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రభుత్వం ఏటా గనుల నుంచే 30 వేల కోట్ల ఆదాయం తీసుకుంటోందని, ఏపీలోనూ సాధించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఖనిజాల తవ్వకంతో పాటు వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం తీసుకొచ్చే మార్గాలనూ అన్వేషించాలని సూచించారు. ఉచిత ఇసుక పంపణీ విధానంపై సీఎం ఆరా తీశారు. వినియోగదారులపై రవాణా భారం ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక త వ్వకాల పరిశీలన, పర్యవేక్షణ కోసం డ్రోన్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మరోసారి శాస్త్రీయ పరిశీలన చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇసుక కేసులో పిటిషనర్‌ నాగేంద్ర లేవనెత్తిన నష్టం అంచనాకు, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోని అంశాలకు పొంతన కుదరడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీస్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఏపీఎ్‌సఏఎస్‌) ద్వారా శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా ఇసుక తవ్వకాలను పరిశీలన చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Updated Date - Oct 18 , 2025 | 05:19 AM