CM Chandrababu Naidu: మీ కష్టం నాకు తెలుసు
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:33 AM
పంచ సూత్రాలతో లాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం సోమవారం నుంచి చేపడుతోంది.
నేనూ రైతు బిడ్డనే.. మీకు అండగా ఉంటా.. అన్నదాతలకు చంద్రబాబు లేఖ
నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’
లాభసాటి సాగుకు పంచసూత్రాలపై అవగాహన
అన్నదాతల ఇళ్లకు తరలిరానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆర్థిక సౌధానికి మూల స్తంభం వ్యవసాయమే
పంటల మార్పిడి పాటించాలి
చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి
ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు మరింత విలువ
13 వేల కోట్లతో 38 పరిశ్రమలకు ఎంవోయూలు
టెక్నాలజీ తోడైతే రైతుకు తిరుగుండదు: సీఎం
అన్నదాతలే ఈ రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు. మీరు పండించే ప్రతి గింజ, ప్రతి పంటా రాష్ట్రానికి బలం. మీ శ్రమతో, సహన శక్తితో మాత్రమే ఏపీ కల నిజమవుతుంది.సంపద సృష్టి జరగడానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. విశాఖ భాగస్వామ్య సదస్సుకు మంచి స్పందన వచ్చింది. 613 ఒప్పందాలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచ సూత్రాలతో లాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం సోమవారం నుంచి చేపడుతోంది. వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అన్నదాతల ఇళ్లకే రానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి రాసిన లేఖను కరపత్రం రూపంలో అందించనున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి అందిస్తున్న.. ఇకపై చేపట్టనున్న చర్యలను ఆయన అందులో ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు పంచుకుంటూ, మార్పునకు నాంది పలకడానికి ప్రభుత్వానికి అన్నదాతలందరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్షిప్తంగా ఆయన లేఖ సారాంశమిదీ..
మీతో కలిసి నడుస్తా..
నేనూ రైతు బిడ్డనే.. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి, మీకు పూర్తి అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభం.. వ్యవసాయ రంగమే. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య రంగాలు రాష్ట్ర జీఎస్‌డీపీలో 35శాతం వరకు వాటా అందిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. 2047 నాటికి ప్రజల తలనరి ఆదాయం రూ.55 లక్షలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున ఏడాదికి 15ు వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించుకున్నాం. రానున్న ఐదేళ్లలో రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా.. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం.
సాగు పద్ధతులు మారాలి..
సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలి. పంటల మార్పిడి పాటించాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి మళ్లీ డిమాండ్ వచ్చింది. చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి. వాతావరణ మార్పులు తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున అవలంబించాలి. సాగుకు టెక్నాలజీ తోడైతే మన రైతులకు తిరుగుండదు. అందుకే అగ్రిటెక్‌ను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ర్టీ పథకంలో ‘యూనిక్ ఐడీ’ల నమోదుతో పథకాలు వర్తింపజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యంపై.. గత ప్రభుత్వం రద్దుచేసిన 100శాతం సబ్సిడీని పునరుద్ధరించాం. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పదెకరాలలోపు రైతులకు గత ప్రభుత్వం సబ్సిడీ తగ్గిస్తే.. దాన్ని 90 శాతానికి పెంచాం. యంత్రాలు, టెక్నాలజీ వాడకంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. వ్యక్తిగతంగా రైతులకు యంత్రాలు సరఫరా చేస్తున్నాం. కిసాన్ డ్రోన్ సేవలు అందిస్తోంది.
అగ్రి ప్రెన్యూర్ రావాలి..
రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. దీనికోసం రూ.13వేల కోట్ల పెట్టుబడితో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సీఐఐ సదస్సులో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌లా.. అగ్రి ప్రెన్యూర్ రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దానికి నాంది పలుకుతుంది. సీసీసీ అంటే.. కాఫీ, కోకో, కోకోనట్ వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం ఇస్తున్నాం.
రైతు కుటుంబాలకు 6,310 కోట్లు..
రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.14వేల వంతున 46,86,838 రైతు కుటుంబాలకు రూ.6,310 కోట్లు ఇచ్చాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఉపశమనంగా ప్రధాన పంటలకు రూ.8 వేలు (హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు) పెంచి ప్రత్యేక పరిహారాన్ని ప్రకటించాం. మార్కెట్ ధరలు తగ్గిన పరిస్థితుల్లో, రైతులను ఆదుకోవడానికి మద్దతు ధర, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాల ద్వారా వరి, కంది, మినుము, పెసర, శనగ, టమాటా, ఉల్లి, మామిడి, కోకో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. రైతులను ఆదుకోవడానికి మొదటిసారిగా పొగాకును కూడా కొనుగోలు చేశాం. 24-48 గంటల్లోనే సొమ్ము చెల్లించాం. ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు హెక్టారుకు రూ.50 వేలు సాయం ప్రకటించాం. మామిడి కిలోకి రూ.4, కోకో పంటకు రూ.50 అదనంగా చెల్లించాం. దీనివల్ల కోకో రైతులకు రూ.11.84 కోట్లు, మామిడి రైతులకు రూ.190 కోట్లు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది.
పాడికి ప్రోత్సాహం..
పశుసంవర్ధక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలపడానికి పాలు, మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాం. మెరుగైన పౌల్ట్రీ పాలసీ(2025-30) తీసుకొస్తున్నాం. పాడి పరిశ్రమకు ఇతోధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు నీటి తొట్టెల నిర్మాణం, మెరుగైన వసతి గృహాలు(గోకులాలు), పశుగ్రాసం పెంపకం, పశుదాణా పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల టీకాలు అందిస్తాం. మాంసం ఉత్పత్తికి బ్రాయిలర్ కోళ్ల పెంపకం, దేశవాళీ కోళ్ల పెంపకానికి ప్రోత్సాహం(ఎన్‌ఎంఎల్), మాంస ఉత్పత్తి, శుద్ధి కేంద్రాల స్థాపన, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. సూపర్‌సిక్స్ హామీల్లో ప్రతి హామీనీ అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్‌సిక్స్‌ను సూపర్‌హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీశక్తి-ఉచిత బస్సు, దీపం-2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ అమలు చేశాం.