CM Chandrababu Naidu: ఏ ఫర్ ఏపీ.. ఏఐ!
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:19 AM
ఆంగ్ల వర్ణమాలలో ఏ మొదటిది. ఆంధ్రప్రదేశ్.. అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఏపీకి కృత్రిమ మేధ(ఏఐ)ను తీసుకొచ్చాం..
అభివృద్ధిలో మొదటి స్థానంలో రాష్ట్రం: చంద్రబాబు
ప్యూచరిస్టిక్ సిటీగా అమరావతి
ఇక్కడ ఇల్లు కట్టుకునేఅవకాశం మిస్ కావొద్దు
సీఐఐ పార్ట్‌నర్‌షిప్ రోడ్‌షోలో సీఎం పిలుపు
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఆంగ్ల వర్ణమాలలో ‘ఏ’ మొదటిది. ఆంధ్రప్రదేశ్.. అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఏపీకి కృత్రిమ మేధ(ఏఐ)ను తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో విశాఖ ఏఐ రంగంలో మొదటి స్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అని చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి దుబాయ్‌లో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. హాజరైన వివిధ యూఏఈ కంపెనీల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 16నెలల కాలంలో 10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. త్వరలో మరో 6లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ‘ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఎంవోయూలు కుదుర్చుకుందాం. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రండి’ అని ఆహ్వానించారు. అమరావతిని ప్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని.. అన్ని వసతులతో పాటు ప్రకృతిలో మమేకమయ్యేలా రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. ‘వినూత్న పద్ధతుల్లో రాజధాని కోసం భూసమీకరణ చేపట్టాం. ఒక్క పిలుపుతో అమరావతి నిర్మాణానికి 29వేల మంది రైతులు ముందుకొచ్చి సుమారు 40వేల ఎకరాలు ఇచ్చారు. అదీ వారు నాపై ఉంచిన నమ్మకం. దేవేంద్రుడు ఉండే అమరావతిని స్వర్గం అంటారు. భూమిపై ఉండే అమరావతిని స్వర్గంలా నిర్మాణం చేస్తున్నాం. మీకు దుబాయ్‌లో.. భారతదేశంలో ఇల్లు ఉండి ఉండొచ్చు.. అమరావతిలో కూడా ఇల్లు ఏర్పాటు చేసుకునే సదవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఇక్కడ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నేను అమరావతిలో నా రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నాను. భూములిచ్చిన రైతులందరినీ ధనవంతులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాం. అమరావతిలో రూ.100 కోట్లతో గ్రంథాలయం నిర్మాణానికి ముందుకొచ్చిన శోభా సంస్థకు ధన్యవాదాలు. ఆతిథ్యరంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులు ఇచ్చాం. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. స్కిల్ డెవల ప్‌మెంట్‌లో యువతకు శిక్షణ ఇస్తున్నాం’ అని సీఎం వివరించారు. ఏపీలో ప్యూచర్ వర్క్‌ఫోర్సును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా 24 పాలసీలు తెచ్చామని.. అవసరమైతే మరిన్ని తీసుకొస్తామని తెలిపారు.
ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా హార్బర్
సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం తెలుపుతామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా హార్బర్ ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏడు ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. మరో 9 రానున్నాయని తెలిపారు. ‘ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కార్గో రవాణాకు ప్రణాళికలు రూపొందించాం. జల, రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నాం. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నాం. దీని కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.
ఫ్యూచర్ మ్యూజియంకు సీఎం
చంద్రబాబు దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించారు. దీనిని లివింగ్ మ్యూజియంగా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయో టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ ప్రదర్శిస్తుంటామని అధికారులు ఆయనకు వివరించారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను కూడా సీఎం సందర్శించారు.