Share News

CM Chandrababu Naidu: హెచ్చరించాకే జరిమానాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:00 AM

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ముందస్తుగా హెచ్చరికలు చేయాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించాకే పెనాల్టీ వసూలు చేయాలని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu: హెచ్చరించాకే జరిమానాలు

  • ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చర్యలు..సిగ్నల్‌ జంప్‌ చేస్తే ఫొటోలు పంపండి

  • సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన..టెక్నాలజీతో నేరగాళ్ల భరతం పట్టండి

  • అన్ని శాఖలకూ ఆర్టీజీఎస్‌ డేటానే ప్రామాణికం..డ్రోన్‌ సిటీ అభివృద్ధిపై దృష్టి

  • రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్దేశం

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ముందస్తుగా హెచ్చరికలు చేయాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించాకే పెనాల్టీ వసూలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని కూడళ్లలో, ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేసే వాహనాల ఫొటోలను యజమానులకు పంపాలని ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతికత అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించినవారు కూడా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో ఫేక్‌ కాల్స్‌తో మోసాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాలని ఆదేశించారు. నిఘాతో నేరాలను కట్టడి చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు అన్నింటికీ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ డేటానే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. నేరస్తులను పట్టుకుని, శిక్షలు పడేలా చేయాలన్నారు. ముందుగానే అనుమానితులను గుర్తించి, నేరాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. నేరాలను బట్టి డేటాలో కలర్‌ కోడింగ్‌ ఇవ్వాలన్నారు.


‘రియల్‌టైమ్‌’లో మరిన్ని సేవలు

వాట్సప్‌ గవర్నెన్స్‌, డేటాలేక్‌, డేటా అనుసంధానం వంటి అంశాలపై సమీక్షలో చంద్రబాబు చర్చించారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే సేవలను చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్‌ సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రోన్‌ సిటీకి విదేశీ సంస్థలు వచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. డ్రోన్‌ సిటీలో పెట్టుబడులు పెరిగేలా కంపెనీలతో చర్చలు జరపాలని సూచించారు.

Updated Date - Jul 15 , 2025 | 04:07 AM