Share News

AP Economic Growth: నాడు ఛీఛీ.. నేడు భలేభలే

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:24 AM

నాడు జగన్‌ ప్రభుత్వం రా ష్ట్రం నుంచి పెట్టుబడిదారులను తరిమివేసిందని, ఇబ్బందుల పాల్జేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.

AP Economic Growth: నాడు ఛీఛీ.. నేడు భలేభలే

  • అప్పుడు పెట్టుబడిదారులను తరిమేశారు

  • ఇప్పుడు వారే బారులు తీరుతున్నారు: చంద్రబాబు

  • ఇంటికో పారిశ్రామికవేత్త.. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • మా ఆలోచన లను అందిపుచ్చుకోండి

  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపు

  • ప్రకాశం జిల్లా లింగన్నపాలెం నుంచి 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం

  • 868 ఎకరాల్లో రూ.873 కోట్లతో ప్రాజెక్టులు

  • రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లు ప్రారంభం

  • మోదీ పాలన, పవన్‌ సహకారం, లోకేశ్‌ పట్టుదల.. నా నాయకత్వంతో అభివృద్ధి పరుగు

  • 50 దేశాల నుంచి విశాఖ సదస్సుకు: సీఎం

కూటమి ప్రభుత్వ ఆలోచనలను అందిపుచ్చుకుని.. ప్రభుత్వ విధానాలను అవగాహన చేసుకుని యువత ముందుకు రావాలి. ఒకరి దగ్గర ఉద్యోగాలు చేయడం కన్నా పారిశ్రామికవేత్తలుగా మారి పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలి.

కేంద్రం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఆలోచన చేస్తే దానిని తెచ్చి అమరావతిలో పెట్టాం. క్వాంటమ్‌ కంప్యూటర్ల తయారీ కంపెనీలు అమెరికా, జపాన్‌ వంటి ఐదారు దేశాల్లో మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి సరసన అమరావతి నిలువనుంది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నాడు జగన్‌ ప్రభుత్వం రా ష్ట్రం నుంచి పెట్టుబడిదారులను తరిమివేసిందని, ఇబ్బందుల పాల్జేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పట్లో ఏపీ అంటే ఛీఛీ అనే వారని.. ఇప్పుడు భలేభలే అనే స్థితికి తెచ్చామన్నారు. అందువల్లనే దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి బారులు తీరుతున్నారని తెలిపారు. ‘పరిశ్రమలు, ఉపాధి కల్పన’ పేరుతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెం వద్ద ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం మంగళవారం ప్రారంభించారు. దీనితో పాటు 17 జిల్లాల్లో మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొత్తం 868 ఎకరాల్లో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టగా.. వాటిలో అనుమతులు పొందిన 1,597 ఎంఎస్ఎంఈ సంస్థలకు సీఎం శ్రీకారం చుట్టారు. వీటితోపాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 87 కేంద్రాల నుంచి వర్చువల్‌గా సుమారు 40 వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం తొలుత ఔత్సాహిక పారిశామ్రికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం లింగన్నపాలెం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం చెప్పారంటే..


సాంకేతిక హబ్‌గా ఆంధ్ర

భవిష్యత్‌ అంతా సాంకేతికతదే. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక హబ్‌గా మారుస్తున్నాం. ఇంటికో ఐటీ ఉద్యోగి అని 30 ఏళ్ల క్రితం పిలుపిచ్చాను. ఇప్పుడు ఇంటికొక పారిశ్రామికవేత్త కావాలని యువతకు పిలుపిస్తున్నా.. ఈ లక్ష్యంలో భాగంగా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను, అలాగే రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ బ్యాంకర్లు కూడా ఉండి ఆర్థిక సాయం అందించే చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టిలో ప్రజల భాగస్వామ్యం కోసం ఇవన్నీ చేస్తున్నాం. కష్టాలన్నింటినీ మాకే పరిమితం చేసుకుని ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. గత పాలకులు సోలార్‌ విద్యుత్‌ పెట్టుబడిదారులు కంపెనీలను మూసేశారు. వారు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోలేదు. వారు కోర్టును ఆశ్రయించడంతో విద్యుత్‌ వాడకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చింది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు పండగ రానుంది. మొత్తం 50 దేశాల నుంచి 532 మంది పెట్టుబడిదారులు ఈ సదస్సుకు వస్తున్నారు.


మోదీ ఆలోచనలను అందిపుచ్చుకుని..

నా నాయకత్వానికి మోదీ విధానాలు, పవన్‌ కల్యాణ్‌ సహకారం, లోకేశ్‌ పట్టుదల తోడై.. పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. కేంద్రంలోని మోదీ ఆలోచనలు చేస్తే వాటిని అందిపుచ్చుకుని తొలుత మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నాం. అలా ప్రధాని ఆలోచనను హైజాక్‌ చేసి.. రాష్ట్రంలో సాంకేతిక రంగాన్ని మరింతగా వృద్ధి చేయగలుగుతున్నాం. దేశంలోనే తొలి డ్రోన్‌ సిటీని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేశాం. ఇక్కడి డ్రోన్లనే ఆపరేషన్‌ సిందూర్‌లో వాడారు. తిరుపతిలోనూ డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ప్రపంచానికి రాష్ట్రం నుంచే డ్రోన్లు సరఫరా జరిగే స్థాయికి తెస్తాం.


రండి.. పరిశ్రమలు స్థాపించండి

గతంలో ఉపాధి కోసం, సంపాదన కోసం సొంత ప్రాంతాలను వదిలి బయటకు వెళ్లిన వారు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని.. తిరిగి వచ్చి పరిశ్రమలు స్థాపించాలి. గతంలో మూడు సార్లు సీఎంగా ఎన్ని పనులు చేశానో ఈసారి అంతకన్నా ఎక్కువగా చేయాలన్న పట్టుదలతో సాగుతున్నాను. ఇవాళ ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పార్కులు, పరిశ్రమలకు తోడు మరో రూ.2.39 లక్షల కోట్ల విలువైన 75 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. వీటి ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. ఇటీవల మొంథా తుఫాన్‌ సమయంలో అధికారులు, నాయకులు కలిసి పనిచేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించి ప్రజలను కాపాడాం. అలాగే పారిశ్రామిక రంగంలోనూ సమన్వయంతో పనిచేయాలి. వారసత్వంగా వస్తున్న రెవెన్యూ సమస్యలతో కొంత ఇబ్బంది ఉంది. వాటిని కూడా పరిష్కరిస్తాం. అవసరమైతే కొరడా ఝళిపిస్తాం.


  • చిన్న పరిశ్రమకు ఊతం!

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలతో భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి.. పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ పెట్టుబడితో పెట్టే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ద్వారానే 97 శాతం ఉద్యోగాలు, ఉపాధి కల్పన సాధ్యమని గుర్తించిన సర్కారు.. చిన్న పరిశ్రమలకే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.

Updated Date - Nov 12 , 2025 | 06:17 AM