Share News

AP CM Chandrababu: గుంత కనిపించొద్దు

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:38 AM

రాష్ట్రంలో వర్షాలు, విపత్తుల కారణంగా జరిగిన రహదారి విధ్వంసాన్ని తెలియజేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వెలువరించిన వార్తాకథనంపై సర్కారు స్పందించింది.

AP CM Chandrababu: గుంత కనిపించొద్దు

  • డిసెంబరు నాటికి పూడ్చేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • విపత్తులతో ధ్వంసమైన రహదారులపై ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

  • అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌

  • జూన్‌ నాటికి 14 వేల కి.మీ.రోడ్ల అభివృద్ధి

  • రూ.3,500 కోట్ల వ్యయ అంచనాతో పనులు

  • ఇందులో ఆస్కీ నుంచి రూ.వెయ్యి కోట్లు

  • చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలన్న సీఎం

  • రేపు కాంట్రాక్టర్లతో కృష్ణబాబు ప్రత్యేక భేటీ

  • ఇక ప్రతి నెలా చెల్లింపునకు గట్టి భరోసా

  • ప్యాచ్‌వర్క్‌ల బిల్లు రూ.400 కోట్లు విడుదల

  • 26న సీఎం వద్ద ప్రత్యేక సమావేశం

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు, విపత్తుల కారణంగా జరిగిన రహదారి విధ్వంసాన్ని తెలియజేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వెలువరించిన వార్తాకథనంపై సర్కారు స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయమే ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాఽథమిక నివేదిక తెప్పించుకున్న ఆయన, ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి, స్పెషల్‌ సీఎస్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌లు, చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర అధికారులతో దీనిపై సమీక్షించారు. రాష్ట్రంలో వర్షాలు, మొంథా తుఫాను చేసిన విధ్వంసం వల్ల 31వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, ఇందులో జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులున్నాయని అధికారులు నివేదించారు. అయితే, తాత్కాలిక మరమ్మతులతో వాటిని ప్రయాణానికి అనుగుణంగా మార్చామని, ఇంకా అనేక ప్రాంతాల్లో రహదారి వర్క్‌లు చేయాల్సి ఉందని అన్నారు. గత ఏడాది ప్రారంభంలో చేపట్టిన గుంతల పూడ్చివేత పనులను వర్షాకాలం రాకముందే పూర్తి చేశామని, కానీ తుఫాను ప్రభావంతో మళ్లీ పరిస్థితి చేయి దాటిపోయిందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపఽథ్యంలో రహదారి మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కనీసం డిసెంబరు నాటికి గుంతలు పూడ్చే పనులు చేపట్టాలన్నారు. పనులు వేగంగా జరిగేలా కాంట్రాక్టర్లలో ఉత్సాహం తీసుకురావాలని, పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లిస్తామన్న భరోసా ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు.


రహదారి పనులు దక్కించుకొని, ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడాలని, అయినా వారు దారికి రాకపోతే నిబంధనల ప్రకారం పనులు రద్దుచేయాలని సీఎం ఆదేశించారు. తుఫాను, వర్షాల ధాటికి దెబ్బతిన్న రహదారులు, వంతెనల పరిస్థితి, తాజా పరిణామాలపై ఆయన చర్చించారు. జిల్లాలవారీగా ఆర్‌అండ్‌బీ సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు.


చేసిన మంచి ప్రజలకు చెప్పండి: సీఎం

జగన్‌ ప్రభుత్వ కాలంలో ఐదేళ్లలో రహదారులను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదే గుంతల రహిత రహదారులు లక్ష్యంగా రూ.861 కోట్లతో వాటిని పూడ్చామని, మరో రూ.1,180 కోట్లతో రహదారి పనులను ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, తుఫానులకు రహదారులు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ఏడాది వ్యవధిలో రహదారుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేసిందో, తుఫానుల వల్ల జరిగిన నష్టం ఏపాటిదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులపై గుంత కనపడితే వెంటనే పూడ్చివేసేలా అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని అమలు చేయాలని ఆదేశించారు. కనీసం డి సెంబరు నెలాఖరు నాటికయినా రహదారి గుంతలను బాగు చేయాలని కోరారు.


టెండర్లు పిలుస్తున్నాం : స్పెషల్‌ సీఎస్‌

సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో రహదారి ప్రాజెక్టుల పరిస్థితి, ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. వచ్చే జూన్‌ నాటికి 14వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తామని, ఇందుకు ఇప్పటికే రూ.2,500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆస్కీ (ప్రత్యేక సహాయం) కింద వచ్చే మరో రూ. 1000 కోట్లతో కలిపి మొత్తం 3500 కోట్లతో ఈ రహదారులను ఆర్‌అండ్‌బీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత వివిధ కారణాలతో రద్దయిన 607 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశామని సీఎంకు నివేదించారు. ఈ పనుల విలువ రూ.277 కోట్లని, వచ్చే మూడు రోజుల్లో వీటికి పరిపాలనా అనుమతులు ఇస్తామన్నారు. వర్షాలు, తుఫానుల కారణంగా దారుణంగా దెబ్బతిన్న 9,101 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.500 కోట్ల నిధులు కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన సీఎంకు వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కృష్ణబాబు తెలిపారు. ఆర్‌అండ్‌బీ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఇకపై నెలనెలా బిల్లులు చెల్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే రూ.1,900 కోట్ల పెండింగ్‌ బిల్లులను చె ల్లించామని, ఇందులో ప్యాచ్‌వర్క్‌లకు సంబంధించి 400 కోట్ల బిల్లులను ఇటీవలే విడుదల చేశామన్నారు. కాంట్రాక్టర్లతో సోమవారం సమావేశం నిర్వహిస్తామని, పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరడంతోపాటు, బిల్లుల విషయంలో వారికి భరోసా కల్పించేందుకుగాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కాగా, సత్యసాయి జిల్లా సహా రాయలసీమలోని ఏడు జిల్లాల పరిధిలో రహదారుల పరిస్థితిపై అధికారులతో కృష్ణబాబు సమీక్ష నిర్వహించారు.


26న చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో రహదారుల తాజా పరిస్థితి, కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులు, అమలవుతున్న వాటి పురోగతిపై ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇచ్చిన హామీల అమలు, కేంద్రంలో వాటి ప్రస్తుత పరిస్థితి, మొంథా తుఫానుకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద తీసుకురావాల్సిన నిధులు వంటి కీలక అంశాలపై అధికారులతో ఈ భేటీలో సీఎం చర్చించనున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 05:38 AM