Fertilizer Availability: ఎరువుల లభ్యతపై భరోసా ఇవ్వండి
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:46 AM
ఎరువులు లేవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంతోపాటు, రైతాంగానికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.
సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ దాకా
క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ తీరు చూడండి
టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎరువులు లేవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంతోపాటు, రైతాంగానికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. శనివారం సీఎం ఇదే అంశంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎరువుల సరఫరాను పరిశీలించాలి. ఎరువుల లభ్యత గురించి వివరించి, రైతులు ఎటువంటి ఆందోళన పడకుండా చూడాలి. అందరికీ ఎరువులు అందుతాయనే భరోసా కల్పించాలి. ఎరువుల సరఫరాలోని అనుమానాలను తొలగించాలి’’ అని నిర్దేశించారు. వెబ్ ల్యాండ్, ఈ-పంట అనుసంధానంతో రైతుల ఆధార్ ఆధారంగా వచ్చే రబీలో ఎరువులు సరఫరా చేయాలని, దీని కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కోరారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని, రైతులకు డిమాండ్ మేరకు ఎరువులు అందుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. అయితే, ఎరువుల సరఫరాపై రైతుల నుంచి నేరుగా తాను తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం సమీక్ష చేశారు. అధికారులు ఇచ్చే సమాచారంతో పాటు ఆయా జిల్లాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని పోల్చిచూసుకుని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 77.396 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆదివారం కాకినాడ పోర్టుకు ఒక నౌక వస్తోందని, దాని నుంచి 15వేల టన్నుల ఎరువులు అదనంగా అందుబాటులో ఉంటాయని, మరో 10రోజుల్లో ఇంకో 41 వేల టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని తెలిపారు. బాపట్ల, కృష్ణా, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఎరువుల్ని పంపిస్తున్నామని తెలిపారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం సూచించారు.