CM Chandrababu Naidu: పేదలకు మెరుగైన వైద్యం కల్పించొద్దా
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:25 AM
మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే...
పీపీపీలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి?
పాత విధానంలో నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుంది
అప్పటి వరకు పేదలు ఇబ్బంది పడాలా?
పీపీపీతో రెండేళ్లలోనే నిర్మాణం పూర్తి
మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో 30 వేల మంది చనిపోయారు
ఇప్పుడు నకిలీ అంటూ వైసీపీ శవరాజకీయాలు
తప్పు చేసిన వాళ్లను వదలను.. సీఎం హెచ్చరిక
వర్చువల్‌గా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభం
నెల్లూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వారికి అభ్యంతరం ఏమిటి? అంటూ నిలదీశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు అనారోగ్యం వస్తే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, కానీ పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన వైద్యం వద్దా? అని ప్రశ్నించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు వద్దు అన్న తీరుగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ముందు విధానంతో పోలిస్తే ప్రస్తుత విధానం ద్వారా 110 పది సీట్లు అదనంగా పేద విద్యార్థులకు దక్కుతాయని వివరించారు. ఆ కాలేజీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. గత పాలకులు అనుసరించిన విధానంతో మెడికల్ కాలేజీల కట్టడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని, అప్పటి వరకు పేదలు ఇబ్బందులు పడాలా? అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాను ఏ పని చేసినా పేదలను దృష్టిలో ఉంచుకునే చేస్తానని, ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను సీఎం వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. 120 దుకాణాలను పేదలకు అందించి వారితోనూ వర్చువల్‌గా మాట్లాడారు. ప్రభుత్వ పనితీరును ఈ సందర్భంగా వివరించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘ఎవరు తప్పు చేసినా నేను చండశాసనుడిలా ఉంటా. ఎవరినీ వదిలిపెట్టను.

నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన వైసీపీ.. నేడు మద్యం పేరుతో శవ రాజకీయాలు చేస్తోంది. ఒక యజ్ఞంలా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసకర పాలన సాగింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. మద్యం విషయంలో చాలా దారుణాలు జరిగాయి. గత ప్రభుత్వ నాసిరకం మద్యంపై విచారణ జరుగుతోంది. కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిని పట్టుకున్నాం. వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనా కూడా రాజీ పడలేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేసి కేసులు పెట్టాం. కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా వైసీపీ రాజకీయాలు చేయాలని చూస్తోంది. నీతి, నిజాయితీతో వ్యాపారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. గతంలో ఎక్కడ చూసినా గంజాయి, నాసిరకం మద్యంతో రాష్ట్రం అతలాకుతలమైంది. మగవాళ్ల ఆరోగ్యం దెబ్బతింది. ఆడవాళ్ల మంగళసూత్రాలు తెగిపోయిన సందర్భాలున్నాయి. ఆ పరిస్థితిని ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నాం. నకిలీ మద్యం అమ్మాలని చూసేవారికి అదే చివరి రోజు అవుతుంది. ఖబడ్డార్ జాగ్రత్త. ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది.
నకిలీని అరికట్టేందుకు యాప్
నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నాం. ఆ యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేసి ఆ మద్యాన్ని ఎవరు తయారు చేశారు.. ఎక్కడ తయారు చేశారన్నది తెలుసుకోవచ్చు. ఏ మద్యం బాటిల్ ఏ షాపులో విక్రయించాలన్నది కూడా త్వరలోనే నిర్ణయిస్తాం. కొంత మంది కావాలని శవ రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి చనిపోతే కొన్నాళ్లు, బాబాయి చనిపోతే మరికొన్నాళ్లు శవ రాజకీయాలు చేశారు. వారి హయాంలో నాసిరకం మద్యంతో ప్రజలు చనిపోయినా లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఇప్పుడు ఎవరూ చనిపోకపోయినా అసత్య ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం. బురద చల్లి కడుక్కోమనడం మంచి పద్ధతి కాదు. నేను అందరి ఆనందం కోసం పనిచేస్తున్నాను. తప్పు చేయాలనుకున్న వారు ఆలోచన మార్చుకోవాలి.
ఇతర చోట్లా స్మార్ట్ స్ట్రీట్ బజార్లు
నెల్లూరులో నిర్మించిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ చాలా వినూత్నమైనది. నిరుపేదలకు జీవనోపాధిని కల్పించే ఇటువంటి ప్రాజెక్టులను రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లో వంద స్మార్ట్ షాపులు, విశాఖపట్నంలో 500 షాపులు ఏర్పాటు చేయబోతున్నాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసి విధ్వంసం చేసింది. నేడు ఆ అప్పులు, వడ్డీలు కట్టడానికి సరిపోతోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకెళుతున్నాం. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ప్రతీ ఇంట్లో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. పోలవరం పనులు ముమ్మురంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విలువలతోనే మీ 15 ఏళ్ల ప్రయాణం విజయవంతం
ఏపీ అభ్యున్నతికి మీరు చేస్తున్న కృషి కొనసాగాలి
సీఎం చంద్రబాబును ఫోన్‌లో అభినందించిన ప్రధాని
ముఖ్యమంత్రిగా 15ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న చంద్రబాబుకు ప్రధాని మోదీ శనివారం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని పేర్కొన్నారు. తాము ఇరువురం సీఎంలుగా ఉన్న సమయంలో కలసి పనిచేశామని నాటి సంగతులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఏపీ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని, ప్రజాసంక్షేమ బాటలో అంకితభావంతో ఆయన చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని మోదీ ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన సీఎం.. స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని ప్రధాని మోదీ సహకారంతో సాధిస్తామని చెప్పారు. గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత ప్రధానిగా మోదీ 25 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

వినూత్నం.. స్మార్ట్ స్ట్రీట్ బజార్
ఆధునిక వసతులతో షాపుల నిర్మాణం
వైఫై, మైక్ అనౌన్స్‌మెంట్, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు
నెల్లూరులో 8.40 కోట్లతో 200 షాపులు
లబ్ధిదారులంతా మహిళలే
స్మార్ట్ స్ట్రీట్ బజార్.. ఈ పేరు వినడానికే కాదు.. రూపకల్పన కూడా కొత్తదే..! తక్కువ పెట్టుబడితో మెరుగైన వసతులు కల్పిస్తూ వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. ఈ వినూత్న ప్రాజెక్టుకు రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరులో శ్రీకారం చుట్టారు. రూ. 8.40 కోట్లతో 200 స్మార్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. నగరంలోని మైపాడు గేటు సెంటర్ రోడ్డు వెంబడి వీటిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన కంటైనర్లలో ఈ దుకాణాలు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో సీసీ కెమెరాలతో పాటు, బజార్ మొత్తం మైక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం కల్పించారు. వ్యాపారస్తులకు విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు కంటైనర్లపై భాగంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ బజార్ మొత్తం వైఫై సౌకర్యం కూడా కల్పించారు. ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ. 4 లక్షలు ఖర్చు అవ్వగా.. అందులో మెప్మా, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్లు రూ. 2 లక్షలను సబ్సిడీగా లబ్ధిదారులకు అందిస్తున్నాయి. మిగిలిన రూ. 2 రెండు లక్షలు బ్యాంకు లోనుగా ఇప్పిస్తారు. అయితే అందులో రూ. లక్ష మంత్రి నారాయణ కుటుంబం పీ4 పథకం కింద లబ్ధిదారులకు అందిస్తోంది. ఇక కేవలం రూ.లక్ష మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంది. మొత్తం 200 దుకాణాలకు గానూ శనివారం సీఎం 120 దుకాణాలను ప్రారంభించారు. ఈ దుకాణాల కేటాయింపు కూడా పారదర్శకంగా జరిగింది. లబ్ధిదారులంతా మహిళలే కావడం విశేషం. వీరందరికీ వ్యాపారంలో శిక్షణ కూడా ఇచ్చారు. వీరిని చెన్నై బర్మా బజారుకు తీసుకెళ్లి వ్యాపారాలపై అవగాహన కల్పించారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ బజారులో నిత్యావసర సరుకుల దుకాణాలు, జ్యూస్ షాపులు, ఫ్రూట్స్ వ్యాపారాలు, ఫొటో స్టూడియోలు, కూల్ డ్రింక్ షాపులు వంటి పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి.