RTO Notice: సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:27 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేటాయించిన కాన్వాయ్‌లోని అంబులెన్సులకు ఇన్సూరెన్స్ చెల్లించని విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడ జీజీహెచ్ పరిధిలో ఐదు అంబులెన్సులు ఉండగా...
నాలుగేళ్లుగా రూ.2.81 లక్షలు పెండింగ్
ఆర్టీవో అధికారుల నోటీసులతో వెలుగులోకి!
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేటాయించిన కాన్వాయ్‌లోని అంబులెన్సులకు ఇన్సూరెన్స్ చెల్లించని విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడ జీజీహెచ్ పరిధిలో ఐదు అంబులెన్సులు ఉండగా, వీటిలో రెండు సీఎం కాన్వాయ్‌లోనివి. వీటికి గతంలో పనిచేసిన వెహికల్ సీనియర్ అసిస్టెంట్, గుమస్తా ఇన్సూరెన్స్ చెల్లించలేదని తెలిసింది. కొంతకాలంగా ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో సీఎం అంబులెన్సుతోపాటు ప్రత్యామ్నాయంగా వాడే అంబులెన్సులకు నాలుగేళ్లుగా సుమారు రూ.2.81 లక్షల బకాయి ఉన్నట్టు ఆర్టీవో అధికారులు నోటీసులు పంపినట్టు సమాచారం. ఈ అంబులెన్సులకు పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఇతర ట్యాక్స్‌లు చెల్లించలేదని తెలిసింది. దీనిపై అధికారులను, గతంలో పనిచేసిన గుమస్తాను ప్రశ్నించగా.. అంబులెన్సులకు సంబంధించిన సీబుక్(ఆర్‌సీ)లు ఎక్కడ పెట్టారో తెలియదని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రికార్డుల విషయంలో తప్పులను గుర్తించిన సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో కొత్తగా వచ్చిన అధికారిణి, విధుల్లో చేరేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. రికార్డుల విషయమై గతంలో పని చేసిన సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని ఆమె ప్రశ్నించగా... తనకేం తెలియదని, తనకు తెలిసినంత వరకు రికార్డులు అక్కడే ఉన్నాయని, ఇన్సూరెన్స్ వివరాలు తన వరకు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ విషయం తేలేవరకూ విధుల్లోకి రానని ఆమె చెప్పినట్టు తెలిసింది. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, ఇన్సూరెన్స్ చెల్లించకపోవడం వాస్తవమేనని, సీనియర్ అసిస్టెంట్‌ను రికార్డులు అడుగుతున్నామని చెప్పారు.