Share News

CM Chandrababu Naidu: స్టీల్‌ప్లాంటుకు పూర్తి సహకారం

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:24 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...

CM Chandrababu Naidu: స్టీల్‌ప్లాంటుకు పూర్తి సహకారం

  • పూర్తిస్థాయి ఉత్పత్తే లక్ష్యం..సమీక్షలో సీఎం

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్మాగారం అధికారులకు సోమవారం సూచించారు. అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, స్టీల్‌ ప్లాంటు సీఎండీ ఏకే సక్సేనా, స్టీల్‌ జాయింట్‌ సెక్రటరీ అభిజిత్‌ నరేంద్ర తదితరులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం అందించిన రూ.11,440 కోట్ల ఆర్థిక సాయంతో ఏడాది కాలంలోనే ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 25 శాతం నుంచి 79 శాతానికి తీసుకువచ్చామని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మూడో త్రైమాసికం ముగిసేలోగా అంటే డిసెంబరు చివరికి 92.5 శాతం ఉత్పత్తి సాధించాలని సూచించారు. దీని కోసం కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతా కలసి పనిచేయాలన్నారు. స్టీల్‌ ప్లాంటుకు పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహకారమైనా అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్లాంటు పనితీరుపై ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో స్టీల్‌ ప్లాంటు డైరెక్టర్‌ జీవీఎన్‌ ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 04:25 AM