CM Chandrababu Naidu: తిరుమలను తలపించేలా...
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:57 AM
తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా రాజధాని అమరావతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం కృష్ణానది పక్కన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాం....
రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆ దేవదేవుడి సంకల్పంతోనే రాజధానికి ఆ పేరు
భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతాభివందనాలు
ఆయనకు అప్రతిష్ఠ తెచ్చే పనిచేయను: ముఖ్యమంత్రి
గుంటూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా రాజధాని అమరావతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం కృష్ణానది పక్కన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. రూ.260 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను రెండున్నరేళ్లలో పూర్తిచేయాలి’ అని టీటీడీని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం 10.55 నుంచి 1.30 గంటల మధ్య ద్వితీయ చతుర్ద్వార మహా ప్రాకారం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు. వేదమంత్రాలు, మంళవాయిద్యాలు, భక్తుల గోవిద నామస్మరణల మధ్య చంద్రబాబు పునాది రాయి వేయడంతో అభివృద్థి పనులు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘దేవతల రాజధాని అమరావతి.. మన రాజధాని కూడా అమరావతి.. ఆ వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే ఈ పేరు పెట్టాను. ఆయన చిత్తంతోనే రాజధాని రైతులు కూడా భూములిచ్చారు. 29వేల మంది రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది శ్రీవారి ఆశీస్సులతోనే సాధ్యం. దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని స్వామిని కోరుకుంటున్నా’ అన్నారు. ఎన్టీఆర్ అన్నదానం.. నేను ప్రాణదానం..
తిరుమలలో ఎన్టీఆర్ 1983లో అన్నదానం ప్రారంభిస్తే.. తాను 2003లో ప్రాణదానం ట్రస్ట్‌ను మొదలుపెట్టానని చంద్రబాబు వివరించారు. ‘బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించడానికి వెళ్తుండగా క్లేమోర్ మైన్స్ పేలిస్తే ఆ వేంకటేశ్వరుడే నాకు ప్రాణభిక్ష పెట్టారు. నేను, మా కుటుంబం ఇంటి దైవంగా వేంకటేశ్వరస్వామిని కొలుస్తాం. మా ఇంటి నుంచి చూస్తే స్వామి కొలువైన శేషాచలం, శ్రీవారి నామాలు కనిపిస్తాయి. ఆయన్ను చూస్తూ బతికి, స్వామి పాదపద్మాల చెంత తరించాం. వేంకటేశ్వరస్వామికి అప్రతిష్ఠ తెచ్చే పనులు చేయను.. ఎవరినీ చేయనివ్వను’ అని స్పష్టం చేశారు. దేవుడి దగ్గరకు పెత్తందారుగా వెళ్లకూడదని, తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే స్వామి శిక్షిస్తారని హెచ్చరించారు. ‘గత ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన సందర్భాలు లేవు. మంచి సంకల్పంతో రైతులు భూములు ఇస్తే వారికి నరకాన్ని చూపించారు. రైతులు వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసి రాజధానిని కాపాడుకోవడానికి పాటుపడ్డారు. అమరావతినే కాకుండా, ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ దేవాలయానికి ఉంది’ అని సీఎం పేర్కొన్నారు.