Share News

CM Chandrababu: విశాఖ సదస్సుకు రండి

ABN , Publish Date - Oct 14 , 2025 | 05:45 AM

విశాఖపట్నంలో వచ్చే నెల 14, 15వ తేదీలలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025కు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.

CM Chandrababu: విశాఖ సదస్సుకు రండి

  • ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం

  • ప్రభుత్వాధినేతగా మోదీ 25 ఏళ్ల పూర్తికి అభినందనలు

  • నేడు గూగుల్‌తో ఎంఓయూ గురించి వెల్లడి

  • గత వైసీపీ విధ్వంస పాలన ప్రస్తావన

న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వచ్చే నెల 14, 15వ తేదీలలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025కు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ప్రధాని పదవుల్లో ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్నందుకు మోదీకి అభినందనలు తెలిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. కర్నూలులో జరిగే సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల ఆదాయం, ప్రభుత్వ సామర్థ్యం పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటే లభించే ఫలితాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధికి కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు ఈ సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారని తెలిపారు. మంగళవారం గూగుల్‌తో జరిగే చరిత్రాత్మకమైన ఎంఓయూ కార్యక్రమం గురించి కూడా మోదీకి ఆయన వివరించారు. విశాఖలో ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్‌ మారుతుందని తెలిపారు. వికసిత భారత్‌లో భాగంగా ఏపీ బ్రాండ్‌ను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యానికి దోహదం చేయాల్సిందిగా కోరారు. ప్రధానితో ముఖాముఖి భేటీలో చంద్రబాబు పలు రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందని, దానిని పునర్‌నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


మద్యం కుంభకోణంలో గత జగన్‌ ప్రభుత్వం, ఆయన అనుచరులు పాల్పడిన నేరాలపై జరుగుతున్న సిట్‌ విచారణపై కూడా ఆయన స్థూలంగా వివరించినట్లు సమాచారం. ప్రధానితో భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానితో సీఎం అంతర్గత చర్చలు కూడా జరిపారు. సమావేశం అనంతరం భేటీ వివరాలను సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు, సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమానికి రావాలని మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజాజీవితంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మోదీని అభినందించినట్లు తెలిపారు.


విశాఖలో నాలుగోసారి సీఐఐ సదస్సు

సీఐఐ భాగస్వామ్య సదస్సును నవ్యాంధ్రలో నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో మూడు సార్లు (2016, 2017, 2018) విశాఖలోనే నిర్వహించారు. ఇప్పుడు నాలుగోసారి కూడా సదస్సుకు విశాఖ నగరమే అతిథ్యం ఇవ్వనుంది. ఈసారి ‘టెక్నాలజీ-ట్ర్‌స్ట-ట్రేడ్‌ నావిగేటింగ్‌ ది జియో ఎకనామిక్‌ ఆర్డర్‌’ థీమ్‌తో మొత్తం 13 సెషన్లుగా సదస్సును నిర్వహించనున్నారు. వివిధ దేశాల నుంచి 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, 13 మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. జీ20 దేశాలు, మిడిల్‌ ఈస్ట్‌, యూరప్‌, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ట్రేడ్‌, జియో ఎకనమిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌, టెక్నాలజీ-ఇన్నోవేషన్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, హెల్త్‌కేర్‌, బయోటెక్నాలజీ, స్మార్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, లాజిస్టిక్స్‌-సప్లయ్‌చైన్‌, సస్టెయినబులిటీ-క్లీన్‌ ఎనర్జీ, లెవరేజింగ్‌ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రి లోకేశ్‌ ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో పాటు రోడ్‌ షోలు నిర్వహించారు.

Updated Date - Oct 14 , 2025 | 05:45 AM