Share News

Minister Sandhya Rani: కురుపాం విద్యార్థినుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:53 AM

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల అస్వస్థతపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు....

Minister Sandhya Rani: కురుపాం విద్యార్థినుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా

  • పరిస్థితి వివరించిన మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల అస్వస్థతపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాలన్నారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో 37 మంది విద్యార్థినులు ఉన్నారని, వారిలో ముగ్గురు ఐసీయూలో ఉన్నట్టు మంత్రి సంధ్యారాణి సీఎంకు తెలియజేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించినట్టు వెల్లడించారు. ఇక పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రిలో 120 మంది వైద్య సేవలు పొందుతున్నారని, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం మరో ఐదుగురు విద్యార్థినులను పార్వతీపురం నుంచి కేజీహెచ్‌కు తరలించారని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యాలు నిలకడగానే ఉన్నాయని తెలిపారు.

మెరుగైన వైద్యం అందించండి : మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కురుపాం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Updated Date - Oct 06 , 2025 | 02:53 AM