Share News

CM Chandrababu: ఇల్లాలి ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:06 AM

ఆరోగ్యవంతమైన మహిళలే కుటుంబానికి పునాది అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాదీ బాగుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: ఇల్లాలి ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం

  • సంపన్న, ఆరోగ్య, సంతోష రాష్ట్రమే లక్ష్యం

  • మహిళే బెస్ట్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌.. కార్పొరేట్ల కంటే డ్వాక్రా, మెప్మాలే గ్రేట్‌

  • తీసుకున్న రుణం ఠంచనుగా కడతారు.. ప్రతి ఒక్కరికీ 2.5 లక్షలబీమా

  • ఐదు కోట్ల మందికి ఆరోగ్య కార్డులు.. మహిళలకు ఎన్టీఆర్‌ ఆస్తి ఇచ్చారు

  • 33ు కోటాతో పెద్దఎత్తున వారిని నరేంద్ర మోదీ సభలోకి తేనున్నారు

  • నేను, నిర్మల ఎకనామిక్స్‌ చేశాం.. ‘స్వస్థ్‌ నారీ..’ సభలో సీఎం వ్యాఖ్యలు

‘‘రాష్ట్రంలో డ్వాక్రా, మెప్మా సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కార్పొరేట్‌ రంగంలో కూడా లేనట్టుగా తీసుకున్న అప్పులు ఠంచనుగా చెల్లిస్తున్నది డ్వాక్రా సంఘాలే. ఈ ఏడాది లక్ష మంది మహిళలను లక్షాధికారులను చేసే కార్యక్రమం చేపడతాం.’’

- చంద్రబాబు

విశాఖపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యవంతమైన మహిళలే కుటుంబానికి పునాది అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాదీ బాగుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలే ప్రతి ఇంటికి బెస్ట్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌లని వ్యాఖ్యానించారు. వెల్తీ, హెల్దీ, హ్యాపీ సొసైటీగా రాష్ట్రాన్ని మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘స్వస్త్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆన్‌లైన్‌లో వారు వీక్షించారు. అనంతరం మహిళలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘పేదలు, ఆడపిల్లల ఆరోగ్యం కాపాడేందుకు మోదీ ‘స్వస్త్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు నిర్వహించే శిబిరాలకు ప్రతి మహిళా భయసంకోచాలు లేకుండా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ సహా పలురకాల ఆరోగ్య పరీక్షలను నిపుణుల ఆధ్వర్యంలో అక్కడ చేపడతారు’’ అని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘ఒక వ్యక్తి నెలకు 750 మిల్లీలీటర్ల నూనె, 300 గ్రాముల చక్కెర, 150 గ్రాములలోపు ఉప్పు వినియోగిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ మూడింటిని సరైన మోతాదులో వాడితే ఆరోగ్యం మన సొంతం.


ప్రతిరోజు అరగంట పాటు యోగా లేదా నడవడం చేయాలి. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్రంలో రూ.20 వేల కోట్లు (ఆరోగ్యశాఖ బడ్జెట్‌) కేటాయించాం. యూనివర్సల్‌ హెల్త్‌కార్డుద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాం. ఎన్టీఆర్‌ హెల్త్‌ స్కీమ్‌ కింద పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తోంది. సంజీవని ద్వారా టెక్నాలజీ వినియోగించి వైద్య సేవలు అందించేలా చేసిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి ఆరోగ్య కార్డులు తయారుచేస్తున్నాం. విశాఖ మెడ్‌టెక్‌ పార్కులో వైద్య పరికరాలు తయారుచేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం’ అని తెలిపారు. ఆరోగ్య బీమాకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని పేర్కొంటూ వేదికపై ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం 75వ జన్మదినం జరుపుకుంటున్న మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సరైన సమయంలో ప్రధానిగా వచ్చిన సరైన నాయకుడు మోదీ అని ప్రశంసించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


దేశీయ వస్తువులే కొందాం..

‘‘నేను పీజీలో ఆర్థికశాస్త్రం చదివాను. నిర్మలా సీతారామన్‌ కూడా ఆర్థికశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ప్రతి ఇంటికి బెస్ట్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌ మహిళలే. జీఎస్టీ సంస్కరణలు 22వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ధరలు తగ్గి ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది. మన ఉత్పత్తులు ప్రపంచ ప్రమాణాలతో అంతర్జాతీయ బ్రాండ్‌లుగా ఎదగాలి. దేశీయ వస్తువులనే అందరం కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశాం. మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్‌. ఇప్పుడు ప్రధాని మోదీ చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లతో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మహిళలకు పెద్దపీట వేయనున్నారు. దేశంలో మహిళలకు సురక్షిత నగరం విశాఖ. అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్‌, ఇతర ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో గొప్ప నగరంగా తయారుచేస్తాం. విశాఖ వాసులు ఎంతో మంచివారు. హుద్‌హుద్‌ విపత్తు సమయంలో వారుచూపిన చొరవ, మంచితనం నేను మర్చిపోలేను. నేను ఎక్కడకు వెళ్లినా విశాఖ గురించి చెబుతాను’’ అని తెలిపారు. కాగా, కన్వెన్షన్‌ హాలు ప్రాంగణంలో సాగరిక హాలులో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి అక్కడ అందించే సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 03:10 AM